'గ్రీన్' కార్డు ప్లీజ్‌.. 12 ల‌క్షల మంది ఇండియ‌న్స్‌ వెయిటింగ్‌!

ఇటీవ‌ల కాలంలో గ‌త ప‌దేళ్లుగా అమెరికాకు వెళ్తున్న భార‌త పౌరుల సంఖ్య పెరుగుతోంది.

Update: 2024-04-17 06:05 GMT

భార‌త దేశంలో రేష‌న్ కార్డు కోసం వెయిట్ చేసిన‌ట్టు.. అమెరికాలో మ‌నోళ్లు గ్రీన్ కార్డు కోసం ఏళ్ల త‌రబ‌డి ఎదురు చూస్తున్నారు. గ్రీన్ కార్డు అంటే.. అంద‌రికీ తెలిసిందే. విదేశీ పౌరులు లేదా కుటుంబాలు.. అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న మార్గం. అలానే వీరు అమెరికా పౌరులుగా కూడా గుర్తింపు పొందుతారు. ఒక ర‌కంగా అమెరిక‌న్‌గా మారిపోతారు. ఇటీవ‌ల కాలంలో గ‌త ప‌దేళ్లుగా అమెరికాకు వెళ్తున్న భార‌త పౌరుల సంఖ్య పెరుగుతోంది.

ఐటీ విస్త‌రించిన త‌ర్వాత‌.. భార‌త్ నుంచి అమెరికాకు వ‌ల‌స‌లు పెరిగాయి. అయితే.. అక్క‌డే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కూడా వీరు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఉద్యోగ ప‌రంగా అక్క‌డే ఉండడం. భార‌త్‌కు తిరిగి రావాల‌న్న ఆకాంక్ష స‌న్న‌గిల్ల‌డంతోపాటు.. అభివృద్ధి మంత్రం వీరిని అగ్ర‌రాజ్యానికి ముడి పెట్టింది. దీంతో గ్రీన్ కార్డు కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇలా.. ఈ కార్డు కోసం.. ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

ఇప్ప‌టి వ‌రకు ఉన్న గ‌ణాంకాల ప్ర‌కారం.. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం.. 12 ల‌క్ష‌ల 60 వేల మంది ఎదురు చూస్తున్నారు. వీరంతా గ‌త మూడేళ్లుగా ద‌ర‌ఖాస్తులు పెట్టుకున్న‌వారే కావ‌డం మ‌రో విశేషం. అయితే.. వీరిని ఎలా ఎంపిక చేస్తారంటూ... మూడు ద‌శ‌ల్లో ఎంపిక చేయ‌నున్న‌ట్టు అమెరికా ప్ర‌క‌టించింది. తొలి, రెండో, మూడో ప్రాధాన్యాల కింద‌.. వీరిని ఎంపిక చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఫ‌స్ట్ ప్రాధాన్యం: అమెరికాలో ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు, లేదా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసిన వారు. ఉపాధి క‌ల్పిస్తున్న‌వారు అయి ఉండాలి. వీరికి తొలి ప్రాధాన్యం.

రెండో ప్రాధాన్యం: అమెరికాలో క‌నీసం 12 ఏళ్లు ఉన్న వారు.. ఎలాంటి కేసులు లేని వారు అయి ఉంటే రెండో ప్రాధాన్యం కింద‌.. గ్రీన్ కార్డు ఇస్తారు. వీరు ట్యాక్సులు క‌డుతున్న‌వారై ఉండాలి.

మూడో ప్రాధాన్యం: అమెరికాలోనే చ‌దువుకుని.. అక్క‌డే ఉపాధి, లేదా ఉద్యోగం చేస్తున్న‌వారు.. అయి ఉంటే మూడో ప్రాధాన్యం కింద గ్రీన్ కార్డు పొందుతారు.

Tags:    

Similar News