రోడ్డు మీద ఛాయ్ దుకాణం.. 73 ఏళ్ల ఆయన స్పెషల్ తెలిస్తే వావ్ అనేస్తారు

మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల లక్ష్మణరావు బాల్యాన్ని చూస్తే.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో నడిచింది.

Update: 2025-02-27 06:30 GMT

కొందరు సాదాసీదాగా కనిపిస్తారు. కానీ.. వారి గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యానికి గురి కావటమే కాదు.. వారికి మించిన స్ఫూర్తిదాతలు ఇంకెవరు ఉంటారు? అనుకోకుండా ఉండలేం. ఇప్పుడు చెప్పే పెద్ద మనిషి వ్యవహారం కూడా ఆ కోవలోకే వస్తుంది. 73 ఏళ్ల లక్ష్మణరావును ఇప్పుడు చూస్తే.. ఓకే అనుకుంటారు. కానీ.. ఆయన పూర్వరంగం గురించి.. ప్రస్తుతం ఆయన ఉన్న స్థాయికి రావటం కోసం ఆయన పడిన శ్రమ చేసిన కష్టం గురించి తెలిసినప్పుడు మాత్రం వావ్ అనుకోకుండా ఉండలేరు. జీవితంలో ఆయన ఎదిగిన తీరు ఎంతో ఆసక్తికరంగానే కాక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

నిత్యం ఏదో ఒకటి సాధించాలన్న సానుకూలతతో పాటు.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ఏ వయసులో అయినా ప్రయత్నం చేయొచ్చన్న విషయం లక్ష్మణరావును చూస్తే అర్థమవుతుంది. రోడ్డు పక్కన టీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ లో టీ కన్సల్టెంట్ గా ఆయన ప్రస్థానం ఒక ఎత్తు అయితే.. చదువు విషయంలో ఆయన చేసిన ప్రయత్నాలు.. సాధించిన విజయాలకు అబ్బురపడకుండా ఉండలేం.

మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల లక్ష్మణరావు బాల్యాన్ని చూస్తే.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో నడిచింది. పదో తరగతి చదివే వేళలో.. అప్పటి పరిస్థితుల కారణంగా చదువును మధ్యలో ఆపేశాడు. మిల్లు కూలీగా చేరాడు. ఆ మిల్లు మూతపడటంతో 1975లో ఢిల్లీకి మకాం మార్చాడు. అక్కడే ఒక హోటల్లో కొంతకాలం పని చేశాడు.

తర్వాతి కాలంలో పుట్ పాత్ మీద టీ దుకాణం.. పాన్ షాపును పెట్టాడు. అయితే.. జీవితంలోని ఏ దశలోనూ ఆయనకు చదువు మీద జిజ్ఞాస (ఏదైనా తెలుసుకోవాలన్న ఆసక్తి) తగ్గలేదు. అదే ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది. నలభై ఏళ్ల వయసులో 12వ తరగతి.. యాభై ఏళ్లకు బీఏ.. 63 ఏళ్లకు ఎంఏ పూర్తి చేశారు. ఏకంగా పాతిక పుస్తకాలు రాసి పబ్లిష్ చేవారు. లక్ష్మణరావు రాసిన ఒక వ్యాసం శాంగ్రీలా హోటల్ ఉపాధ్యక్షుడిగా తెగ నచ్చేసింది.

అంతే.. ఆయన గురించి తెలుసుకున్న పెద్ద మనిషి.. శాంగ్రీలా హోటల్ కు టీ కన్సల్టెంట్ గా ఉపాధిని కల్పించారు. తన జీవితంలో మళ్లీ చదువుకొని ఉండకపోతే తాను ఈ రోజున ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేవాడిని కాదన్న ఆయన మాటలు అక్షర సత్యాలని చెప్పక తప్పదు. ఇక.. ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఇద్దరు కొడుకులు. వారిద్దరు ఎంబీఏ చదివి బ్యాంక్ ఉద్యోగాలు చేస్తున్నారు. వయసు మీద పడిందన్న మాటను కొందరు చెబుతారు. వయసు అన్నది ఒక అంకె మాత్రమే. తరగని ఉత్సాహం.. సాధించాలన్న కసి ఉండాలే కానీ.. వయసు దేనికి అడ్డంకి కాదన్నది లక్ష్మణరావు లాంటి వారిని చూస్తే.. అర్థమవుతుంది.

Tags:    

Similar News