స్థలం కబ్జా.. యజమాని హత్యకు కుట్ర.. వైసీపీ నేతపై కేసు!
ఈ సమయంలో.. కోట్ల రూపాయల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు వైసీపీ నేత కిరాయి హత్యకు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల బాధితులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారని తెలుస్తోంది. దీంతో.. వరుసగా వైసీపీ నాయకులపై ఫిర్యాదులు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో.. కోట్ల రూపాయల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు వైసీపీ నేత కిరాయి హత్యకు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు!
అవును... కోట్ల రూపాయలు విలువైన స్థలం కొల్లగొట్టేందుకు.. స్థల యజమానిని హత్యమార్చాలని, ఏక పక్షంగా సొంతం చేసుకోవాలని కొంతమందికి సుపారీ ఇచ్చి ప్లాన్ చేశారంటూ వైసీపీనేత, ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి వ్యవహారం పోలీసుల విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా... స్థల యజమానిని అని చెబుతున్న ఉమమహేశ్వర శాస్త్రి ఫిర్యాదుపై విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఇటీవల కేసు నమోదైంది. ఈ సమయంలో.. నిందితుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు! ఈ సమయంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని.. అతని కోసం గాలిస్తున్నారని తెలుస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... విజయవాడలోని సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి తల్లి పేరిట లక్ష్మీనగర్ లో 325 చదరపు అడుగుల స్థలం కొని 2014లో రిజిస్టర్ చేశారంట. అయితే... ఈ స్థలాన్ని గౌతమ్ రెడ్డి ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారనేది ఉమామహేశ్వరశాస్త్రి ఆరోపణ. దీంతో... ఇరువురి మధ్య సుమారు ఏడేళ్లుగా వివాదం నడుస్తోంది.
ఈ సమయంలో గౌతమ్ రెడ్డి వ్యవహారంపై ఉమామహేశ్వరశాస్త్రి యూట్యూబ్ లో వీడియోలతో తన ఆవేదనను చెప్పుకున్నారు! ఇందులో భాగంగా... తాను చెప్పేది అసత్యమైతే తనను నడిరోడ్డుపై కాల్చి పారేయండని అన్నారు.. ఏడేళ్లుగా గ్యాగ్ స్టర్ తో పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.. సత్యనారాయణపురంలో కొన్ని వందల బ్రాహ్మణ కుటుంబాలను గౌతమ్ రెడ్డి నాశనం చేశారని ఆరోపించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో.. శాస్త్రిని అంతమొందించడానికి గౌతమ్ రెడ్డి తన డ్రైవర్ బందా శ్రీను, అనుచరులకు రూ.24 లక్షల సుపారీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో.. ఈ నెల 6న శాస్త్రి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని తెలిసి, ఇంటి గోడ దూకి లోపలికి వెళ్లి కత్తితో దాడి చేసి గాయపరిచారని.. ఇంట్లో ఉన్న పత్రాలు తిసుకుని పారిపోయారని అంటున్నారు.
దీంతో... తనపై హత్యాయత్నం జరిగిందంటూ బాధితుడు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా... వైసీపీ నేత గౌతమ్ రెడ్డి, బందా శ్రీనుతో పాటు మరో నలుగురిపై హత్యాయత్నం, దోపిడీపై బీ.ఎన్.ఎస్.లో సెక్షన్ 109 (2), 61 (2), 309 (6) కింద కేసు పెట్టారు. ఈ ఘటనలో 9మందిని నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు!