బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన బ్లడ్ స్కాం కథేంటి?

కలుషిత రక్తంతో సొంత ప్రజల ఆరోగ్యాల్ని మాత్రమే కాదు వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ దుర్మార్గానికి సంబంధించి అక్కడి ప్రభుత్వం తాజాగా ఒక రిపోర్టును విడుదల చేసింది.

Update: 2024-05-21 04:49 GMT

అగ్రరాజ్యాలుగా పేరు ప్రతిష్ఠలున్న దేశాల్లోనూ కొన్ని దుర్మార్గాలు.. దురాగతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సొంత ప్రజల క్షేమాన్ని పక్కన పెట్టేసే ఈ దారుణాలు బయటకు వస్తుంటాయి. అలాంటి కోవలోకే చెందింది బ్రిటన్ పేరు ప్రతిష్ఠలను మంట కలిగి.. ఆ దేశ పరువును బజారున పడేసిన స్కాంలో నీచమైనది బ్లడ్ కుంభకోనం. కలుషిత రక్తంతో సొంత ప్రజల ఆరోగ్యాల్ని మాత్రమే కాదు వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ దుర్మార్గానికి సంబంధించి అక్కడి ప్రభుత్వం తాజాగా ఒక రిపోర్టును విడుదల చేసింది. అందులో పేర్కొన్న వివరాల్ని చదివేకొద్దీ గగుర్పాటుకు గురి కాక తప్పదు.

బ్రిటన్ ఆరోగ్య విభాగం చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ ఉదంతం ఎప్పుడు మొదలైందంటే 1970లలో అని చెప్పాలి. హిమోఫిలియా (రక్తం గడ్డ కట్టే సామర్థ్యం లేని) బాధితుల కోసం బ్రిటన్ ప్రభుత్వం కొత్త చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి ఫ్యాక్టర్ 8గా పేరు పెట్టారు. ఈ చికిత్సకు అవసరమైన రక్తాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడే వేలాది మందికి అవసరమయ్యే రక్తమార్పిడి కోసం పెద్ద ఎత్తున రక్తం అవసరమైంది. అయితే.. ఈ చికిత్స తర్వాత అనేక మందిలో దుష్ప్రభావాలు షురూ అయ్యాయి.

నిజానికి విదేశాల నుంచి రక్తాన్ని దిగుమతి చేసుకునే తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్దన్న సూచనే చేసింది. అయినప్పటికీ దాన్ని పట్టించుకోని నాటి ప్రభుత్వం రక్తాన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు. ఫ్యాక్టర్ 8 చికిత్స తీసుకున్న చాలామందిలో లివర్ ఇన్ ఫెక్షన్ కు గురవుతున్నట్లు గుర్తించారు. కొన్నాళ్ల తర్వాత ఇది హెచ్ ఐవీగా.. హెపటైటిస్ సీగా గుర్తించారు. ఈ విధంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా? 30వేలకు పైనే. ఇన్ ఫెక్షన్ బారిన పడుతున్న వారిలో చాలామంది ప్రాణాల్ని కోల్పోతున్నట్లుగా గుర్తించారు.

కొంతకాలంలోనే మూడు వేల మంది బాధితులు చనిపోయినట్లుగా రిపోర్టులు బయటకు వచ్చాయి. బ్రిటన్ దేశ చరిత్రలోనే అతి దారుణ కుంభకోణాల్లో ఒకటిగా బ్లడ్ స్కాం నిలిచింది. ఫ్యాక్టర్ 8 చికిత్స కోసం ఉపయోగించిన బ్లడ్ లో ఖైదీలతో పాటు మత్తుపదార్థాలకు బానిసలైన దాతల నుంచి సేకరించిన రక్తంలోని ప్లాస్మాను ఫార్మా కంపెనీలు వినియోగించినట్లుగాగుర్తించారు. ఇలా వేల మంది దాతల నుంచి సేకరించిన ప్లాస్మా కావటంతో.. అందులో ఒక్కరికి ఇన్ ఫెక్షన్ ఉన్నా.. ఇది ఇతరులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ కలుషిత రక్తం.. ప్లాస్మా ఉత్పత్తులను అనేకమంది రోగులకు ఎక్కించటం ద్వారా అనేక మంది హెచ్ ఐవీ.. హెపటైటిస్ బారిన పడినట్లుగా గుర్తించారు. పలువురి నుంచి సేకరించిన ప్లాస్మాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1953లోనే సూచించినా.. నాటి బ్రిటన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిర్లక్ష్యంతో వ్యవహరించటం ద్వారా పెద్ద ఎత్తున ప్రాణాలు పోవటానికి కారణమైంది. తన తప్పులు బయటకు వచ్చిన తర్వాత కవర్ చేసే ప్రయత్నం చేసింది.

రక్తం కలుషితమైందనే ముందస్తు హెచ్చరికలు వచ్చినా.. అందుకు తగిన ఆధారాలు లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతేకాదు.. తమ తప్పుడు కారణాలతో బాధితులకు ముప్పు ఉందన్న విషయాన్ని దాచి పెట్టారు. వారికి అవసరమైన చికిత్సను అందించే విషయంలో దారుణంగా వ్యవహరించి.. వారి ప్రాణాల్ని తీశారన్నది ఆరోపణ పెద్ద ఎత్తున ఉంది. కలుషిత రక్తం గురించి సమాచారం తెలిసినప్పటికీ నాటి ప్రభుత్వాలు.. అధికారులు తమ పాపాల్ని కప్పిపుచ్చుకున్నట్లుగా చెబుతారు.

ఈ నిర్లక్ష్యం మీద వాస్తవాల్ని బయటపెట్టాలని.. తమకు తగిన పరిహారం ఇవ్వాలంటూ 1980 నుంచి బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. చివరకు బాధితుల ఆందోళనలతో దిగి వచ్చిన 2017 నాటి ప్రధాని థెరిసా మే సర్కారు ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఇందులో భాగంగా దాదాపు 5 వేల మంది బాధితులు. .సాక్షుల నుంచి వివరాల్ని సేకరించి.. రిపోర్టును తయారు చేశారు. నాటి తప్పుడు పనుల భాగోతాలు తాజాగా బయటకు రావటంపై హర్షం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా దాచిన దుర్మార్గాలు తాజా రిపోర్టుతో బయటకు వచ్చాయని చెప్పాలి.

Tags:    

Similar News