టీడీపీలో చేరికపై వైసీపీ ఎంపీ క్లారిటీ... ముహూర్తం అప్పుడే!

ఈ మధ్యే వైసీపీకి రాజీనామా చేసిన యువ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు.. టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు

Update: 2024-02-26 10:10 GMT

ఈ మధ్యే వైసీపీకి రాజీనామా చేసిన యువ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు.. టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి మరోసారి నరసరావు పేట నుంచే పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు.. వైసీపీ గుంటూరు నుంచి పోటీ చేయాలని చెప్పిందని.. దీంతో ఆయన హర్ట్ అయ్యారని.. అందుకే సైకిల్ ఎక్కేందుకు సిద్ధపడ్డారని అంటున్నారు. అయితే ఇటీవల... ఆయన తిరిగి వైసీపీలోకి రాబోతున్నారనే ఊహాగాణాలు కూడా తెరపైకి వచ్చాయి.

ఈ క్రమంలో పార్టీ మార్పుపైనా, టీడీపీలో చేరికపైనా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా తాను త్వరలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఆయన లేఖ రాశారు. ఇందులో భాగంగా పార్టీ మార్పు గురించి చెబుతూనే... వచ్చే ఎన్నికల్లోనూ తనను గెలిపించాలని కోరారు!

ఈ క్రమంలో నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు ఐదేళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు మరువలేనివని పేర్కొన్న ఆయన... పల్నాడు జిల్లా అభివృద్ధి కోసమే తాను తిరిగి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే త్వరలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో సైకిల్ ఎక్కి మరోసారి ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు రాబోతున్నాను అన్నట్లుగా చెప్పిన లావు... తనను గెలిపించాలని కోరారు!

ఈ నేపథ్యంలో.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పిన ఆయన... మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని లేఖలో పేర్కొన్నారు. దీంతో... లావు శ్రీకృష్ణదేవరాయులు టీడీపీలో చేరడంపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.

కాగా... గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసరావు పేట ఎంపీగా పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయులు... టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై 1,53,978 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరుతుండటంతో... మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను ఈదఫా నరసరావుపేట ఎంపీగా బరిలోకి దించారు జగన్. మరి ఈ రసవత్తరపోరులో విజయం ఎవరి వరిస్తుందో వేచి చూడాలి!

Tags:    

Similar News