కిరణ్ రాయల్ ఎపిసోడ్ లో ట్విస్టు.. ఆరోపణలు చేసిన మహిళ అరెస్టు

తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మి అరెస్టు అయ్యారు.

Update: 2025-02-10 09:53 GMT

తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మి అరెస్టు అయ్యారు. చీటింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీని రాజస్థాన్ పోలీసులు అనూహ్యంగా అరెస్టు చేశారు. సోమవారం తిరుపతి ఎస్పీని కలిసి కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మీ అనంతరం మీడియాతో మాట్లాడారు. కిరణ్ రాయల్ పై అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమెను రాజస్థాన్ రాజధాని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కిరణ్ రాయల్ ఎపిసోడ్ అనూహ్య మలుపు తిరిగింది. కిరణ్ రాయల్ తన వద్ద కోటి రూపాయలు తీసుకుని మోసం చేశాడని రెండు రోజులుగా తిరుపతికి చెందిన లక్ష్మీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అదేవిధంగా ఆమెకు ఇవ్వాల్సిన డబ్బంతా ఎప్పుడో ఇచ్చేశానని, రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేని ప్రత్యర్థుల ప్రోద్బలంతోనే ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని కిరణ్ రాయల్ చెబుతున్నారు.

ఇలా ఇద్దరూ పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం, వీడియోలు విడుదల చేస్తుండటంతో ఈ ఎపిసోడ్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కూడా ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలని పార్టీ నేతలతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. అంతవరకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే కిరణ్ రాయల్ పై తాజాగా మరికొన్ని ఆరోపణలు చేసింది లక్ష్మీ.

అయితే అనూహ్యంగా పెండింగులో ఉన్న చీటింగ్ కేసులో లక్ష్మిని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన లక్ష్మిపై దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు పెండింగులో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, తన అరెస్టుకు కిరణ్ రాయల్ కారణమంటూ లక్ష్మి ఆరోపిస్తున్నారు. ఏదైనా ఈ వ్యవహారం ఊమించని టర్న్ తీసుకోవడం సంచలనంగా మారింది.

Tags:    

Similar News