`నామినేటెడ్` కూడికలు-తీసివేతలు.. @ 100 డేస్.. !
నామినేటెడ్ పదవులు విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం అనేక మలుపులు తిరుగుతోంది.
నామినేటెడ్ పదవులు విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి తీసుకున్న నివేదికలు, అదేవిధంగా జిల్లాల ఇన్చార్జిలు నుంచి తీసుకున్న పలు అంశాలతో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తిస్తామని కూడా చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో చాలామంది నాయకులు తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశలు పెట్టుకున్నారు.
వాస్తవానికి ఎన్నికల సమయంలో చాలామంది కష్టపడ్డారు. మరికొందరు చంద్రబాబు మాట కోసం తమ స్థానాలను కూడా వదులుకున్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు చంద్రబాబు తమకు మేలు చేస్తాడని తమకు నామినేట్ పదవులు ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ పదవుల విషయంలో రోజురోజుకు సమీకరణలు మారిపోతున్నాయి. దీనికి కారణం ఒక వైపు జనసేన, మరోవైపు బిజెపిలు ఈ పదవుల కోసం పోటీ పడుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి.
వాస్తవానికి ఇప్పటికే 30% పదవులు జనసేనకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ మొదట్లో 18 నుంచి 20 శాతం మధ్య ఇవ్వాలని అనుకున్నారు. అయితే జనసేనలో కూడా చాలామంది సీనియర్లు ఉండడం వారంతా పదవులు కోసం వేచి ఉన్న క్రమంలో తమకు కొంచెం ఎక్కువ ఇవ్వాలని పవన్ పట్టుబట్టడంతో దాన్ని మరో 10 శాతం పెంచి 30 శాతానికి తీసుకొచ్చారు. ఇక బిజెపి విషయానికి వస్తే 10 శాతం పదవులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ దీనికి బిజెపి సీనియర్లు ఒప్పుకోవడం లేదు.
ఈ పరిణామాలకు క్రమంలో నామినేటెడ్ పదవులు విషయంలో ఇప్పుడు మరోసారి చంద్రబాబు అంతర్మథనంలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన మరో వంద రోజులు సమయాన్ని తీసుకోనున్నట్టు చెప్పుకొచ్చారు. గత రెండు రోజులుగా చేపట్టిన వరుస సమీక్షల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవులు విషయాన్ని ప్రస్తావిస్తూ మరో వంద రోజుల వరకు సమయం పడుతుందని అప్పటివరకు నాయకులు కార్యకర్తలు వేచి చూడాలని పేర్కొన్నారు.
దీంతో టీడీపీలో మరెన్ని మార్పులు జరుగుతాయో? మరెన్ని కూడికలు తీసివేతలు వెలుగు చూస్తాయోనని నాయకులు తల్లడిల్లుతున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. ఇప్పటి వరకు వచ్చిన జాబితాలను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. గత రెండు మాసాల కాలంలో నాయకులు వ్యవహరించిన తీరు.. పార్టీ కోసం.. ప్రభుత్వం కోసం.. చేసిన పనులు, క్షేత్రస్తాయిలో ఉన్న గ్రాఫ్ వంటివి పరిగణనలోకి తీసుకునే అవకాశంఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం చేస్తారోచూడాలి.