వైసీపీలోకి జంప్ జిలానీ.. ఆ సీటు ఇచ్చేస్తారా?
తాజాగా టీడీపీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.. ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఆయన సీఎంవో వర్గాలతో ముఖ్యంగా కీలక సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డితో భేటీ అయ్యారు.
ఎన్నికలకు ముందు.. ఏపీలో జంపింగులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొందరు అటు ఇటు.. అంటూ వైసీపీలోకి, టీడీపీలోకి జంప్ చేసేశారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలోకి వెళ్లగా.. ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య.. టీడీపీ బాట పట్టారు. అదేవిధంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీతో మంతనాలు చేస్తున్నారు. మొత్తంగా.. ఈ జంపింగులు ఇప్పట్లో ఆగేలా లేవు. తాజాగా టీడీపీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.. ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఆయన సీఎంవో వర్గాలతో ముఖ్యంగా కీలక సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డితో భేటీ అయ్యారు.
పార్టీ మారే విషయంపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఆయనను తీసుకునేందుకు సలహాదారు స్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక, సీఎం జగన్ సమక్షంలో చర్చించి.. ఆయన పార్టీలో చేరడమే తరువాయి అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇక, రావెల్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఐఆర్ ఎస్ ఉద్యోగి అయిన రావెల 2014 ఎన్నికలకుముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం.. స్థానికుడు కూడా కావడంతో ఆయనకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కేటాయించారు. ఆ ఎన్నికల్లో రావెల విజయం దక్కించుకున్నారు. ఆ వెంటనే మంత్రి కూడా అయ్యారు.
అయితే.. మంత్రిగా ఉన్నప్పుడు రావెల కుమారులు ఇద్దరిపైనా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రభావంతో ఆయనను రెండో దఫా షఫిలింగ్ చేసినప్పుడు తప్పించారు. తర్వాత.. ఆయన టీడీపీ వ్యతిరేక వర్గంతో స్నేహం చేయడం ప్రారంభించారు. ముఖ్యం గా సీఎం చంద్రబాబును అప్పట్లో వ్యతిరేకించిన.. మంద కృష్ణమాదిగను ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడం.. వివాదాస్పదమైంది. అయినప్పటికీ.. పార్టీలోనే చంద్రబాబును ఆయనను కొనసాగించారు. కానీ, ఎన్నికల సమయానికి ఆయన జనసేనలోకి చేరిపోయారు. ఈ క్రమంలో మరోసారి జనసేన తరఫున ప్రత్తిపాడు టికెట్ దక్కించుకున్నారు. కానీ, ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.
తర్వాత.. జనసేనను వదిలేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక జరిగినప్పుడు టికెట్ ఆశించారు. అయితే.. టికెట్ దక్కలేదు. దీంతో మళ్లీ జనసేనలోకి వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకి ప్రస్తుతం ఆయన ఏపీ వ్యవహారాలు చూస్తున్నారు. బీఆర్ ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్‌తో కలిసి బీఆర్ ఎస్ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో కేవలం తెలంగాణకే పరిమితం కావాలని బీఆర్ ఎస్ అధినేత నిర్ణయించిన దరిమిలా రావెల.. వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకురెడీ అయ్యారు. ఆయనకు తిరిగి ప్రత్తిపాడు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ టికెట్‌ను కిరణ్‌కుమార్(మాల)కు కేటాయించారు. అయితే, మాదిగ సామాజిక వర్గం ఆయనను వ్యతిరేకిస్తున్న దరిమిలా.. ఇప్పుడు రావెల రాకతో సమీకరణలు మారే చాన్స్ ఉంది.