కామ్రెడ్స్ చేతులు కలిసినా.. మనసులు కలవలేదు.. ఇదంతే!
దేశంలో నిజానికి ప్రజల సమస్యలపై స్పందిస్తున్న పార్టీలుగా వామపక్షాలకు మంచి గుర్తింపు ఉంది.;

దేశంలో నిజానికి ప్రజల సమస్యలపై స్పందిస్తున్న పార్టీలుగా వామపక్షాలకు మంచి గుర్తింపు ఉంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కానీ, ఒకప్పుడు ఉన్న ఉమ్మడి కార్యాచరణ.. ఐక్య ఉద్యమాలు వంటివి దాదాపు ఒక దశాబ్దకాలంగా అయితే లేకుండా పోయాయి. మరోవైపు.. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. వచ్చే ఏడాది ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఐక్యతా రాగం తీశారు కామ్రెడ్లు. తమిళనాడులోని మదురై వేదికగా.. 24వ అఖిల భారత మహాసభకు శ్రీకారం చుట్టారు. దీనికి సీపీఐ, సీపీఎం వంటి ప్రధాన పక్షాలతోపాటు.. ఇతర సీపీఐ(ఎంఎల్), సీపీఐ(న్యూడెమొక్రసీ) సహా పలుచిన్న చితకా పార్టీలు, మరికొన్ని నిషేధిత సంస్థలు కూడా పాల్గొన్నాయి. అయితే.. ఈ సందర్భంగా మరోసారి ఐక్యతా రాజకీయాలకు తెరదీయాలని.. మోడీ, ఆర్ ఎస్ ఎస్‌ల దమన కాండను ప్రశ్నించాలని సంకల్పం చెప్పుకొన్నారు.
కానీ, సంకల్పం బాగున్నా.. కార్యాచరణపైనే అనేక సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. వేదికపైకి ఎక్కిన బలమైన కామ్రెడ్స్ చేతులు కలిపినా.. వారి మనసులు మాత్రం కలవకపోవడం గమనార్హం. బలమైన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే.. ఆ సభలకు వెళ్లకుండా .. ఈ సభలకు రావడంపై.. కమ్యూనిస్టులకు చెందిన పత్రికల్లో విమర్శనాస్త్రాలు వచ్చాయి. ఇదిలావుంటే.. ఐక్యతా ఉద్యమాలకు కలిసి సాగుదామన్న ప్రకాశ్ కరట్ వంటి కీలక నేతల సూచనలు కూడా.. పెద్దగా పరిగణనలోకి తీసుకున్న దాఖలా కూడా కనిపించలేదు.
ఎవరు అధికారంలో ఉంటే.. వారిని వ్యతిరేకించే లక్షణంతోపాటు.. విధాన పరమైన నిర్ణయాల విషయంలో నూ.. వ్యతిరేక ధోరణి అవలంబిచడంతోనే.. కమ్యూనిస్టులకు.. ప్రజలకు మధ్య కనెక్టివిటీ లేకుండా పోయిందన్నది నిష్టుర సత్య. అంతర్గత ఒడంబడికలు చేసుకుని .. ప్రభుత్వాలతో మచ్చిక రాజకీయాలు చేస్తున్నదుర్గతి కూడా కామ్రెడ్స్‌కు అశనిపాతంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఐక్యతా రాజకీయాలకు చిల్లు పడి.. పార్టీలు.. ఒంటరిపోరాటం దిశగా పాకులాటి.. ప్రాబవాన్ని కోల్పోతున్నాయి.