వన జీవి ధన్య జీవి

అంటే 87 ఏళ్ళ ఆయన జీవితంలో 77 ఏళ్ళు మొక్కల కోసమే బతికారు అంటే ఆయన కంటే ధన్యజీవి ఎవరు ఉంటారు.;

Update: 2025-04-13 01:30 GMT
వన జీవి ధన్య జీవి

ఆయన ధన్య జీవి అయ్యారు. ఇంటి పేరు పుట్టినప్పుడు ఒంటికి దానికి అదే తగిలించుకుంటుంది. అలాగే పెద్దలు పెట్టిన మరో పేరు జత కలుస్తుంది. ఆ రెండూ కాదు మనిషిని మనీషిగా చేసేది. సమాజం కలకాలం గుర్తుంచుకునేలా కొలమానం చూసేది. మనిషి తనంతట తానుగా ఎదిగి మహానుభావుడు గా నిలిచిన నాడే ఆయనకు అంటూ ఒక పేరు చరిత్రలో పదిలంగా ఉంటుంది.

అలాంటి వారు బహు కొద్ది మంది. ఎంత్గో మంది పుడుతూ గిడుతూ ఉంటారు. కానీ కొందరికే కీర్తి దక్కుతుంది. దేహం చాలించినా ఆ కీర్తి కీర్తి కాయంగా కలకాలం నిలుస్తుంది. అలా చూస్తే వన జీవి రామయ్య చరిత్రలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్న వారు.

ఆయన ఎవరి కోసమో ఏదీ చేయలేదు. తాను అనుకున్నది చేసుకుంటూ వచ్చారు. అది ప్రకృతికి వరమైంది. అందరికీ హితమైంది. అందుకే ఆయన ఇంటిపేరు ఒంటి పేరు కూడా మారింది. వన జీవి రామయ్య అంటేనే ఆయనకు గుర్తింపుగా తెచ్చింది.

ఆయన చదివింది అయిదవ తరగతి వరకూ మాత్రమే. కానీ ఆ చదువు ఆయన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించింది. అది చాలు చదువుకు సార్ధకత ఏమిటో చెప్పడానికి. అయిదవ తరగతిలో రామయ్యకు ఆయన గురువు మల్లేశం ప్రబోధించిన మొక్కల పెంపకం- లాభాలు అనే పాఠం ఆయనలో తెలియని స్ఫూర్తినింపింది. అది లగాయితూ ఆయన మొక్కల గురించే ఆలోచించేవారు

అంటే 87 ఏళ్ళ ఆయన జీవితంలో 77 ఏళ్ళు మొక్కల కోసమే బతికారు అంటే ఆయన కంటే ధన్యజీవి ఎవరు ఉంటారు. ఇక బాల రామయ్య ఆనాడే తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా భాగంలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు.

అక్కడితో ఆయన ఆశ ఆగలేదు. రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా కాస్తా ఖాళీ జాగా కనిపిస్తే చాలు మొక్కలు నాటడమే రామయ్యకు తెలుసు. ఇక ఆయన వృత్తి వేరు. కుండలు తయారీ చేస్తారు, పాలు అమ్ముతారు. కానీ ఈ ప్రవృత్తి అసలు వృత్తిని అధిగమించేసింది.

దీంతో ఆయన మొక్కల పెంపకం ద్వారానే తన జీవితంలో అధిక భాగం గడిపారు అని చెప్పాలి. అలా ఆయన ఒక నడిచే వనం అయ్యారు. అందరికీ నందన వనాలు చూపించారు. ఈ రోజుల్లో చాలా కావాల్సినది మొక్కల పెంపకం. మొక్కలు ఉంటే ఆక్సిజన్ వస్తుంది. భూతాపం చల్లారుతుంది. మనిషితో పాటు ప్రకృతి మనుగడ కూడా సాధ్యపడుతుంది.

అలా ఏకంగా భూగోళానికే ఓదార్పుని ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని రామయ్య ఎంచుకున్నారు అంటే ఆయన కంటే ధన్య జీవి ఎవరు ఉంటారు. ఆయన ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే మొక్కలనే ఇస్తారు. ఆయనకు అవి అంత ప్రాణ ప్రదంగా మారాయి.

మొక్కల పెంపకం మీద ప్రజలకు అవగాహన కలిగించడానికి తన తలకు రింగుగా ఒక బోర్డు చుట్టుకుని వృక్షో రక్షతి రక్షిత అన్న నినాదాన్ని సదా ప్రచారం చేస్తూ తానే ఒక అంబాసిడర్ గా మారిపోయారు. రామయ్యను ప్రభుత్వ పరంగా గుర్తించిన వారు ఉమ్మడి ఏపీకి 2000లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు. ఆయన రామయ్య సేవలను గుర్తించి ఒక మోపెడ్ ను నెల నెలా 1500 రూపాయిల భత్యాన్ని కేటాయించారు. దీనిని మొక్కల ప్రచార రధంగా రామయ్య వినియోగించారు.

రామయ్యను ఆ మీదట రాజకీయ నేతలు ప్రభుత్వాలు గుర్తించడం మొదలుపెట్టాయి. అలా 2017లో ఆయన పద్మశ్రీ అందుకునే దాకా తన కీర్తిని విస్తరించుకున్నారు. తన పిల్లల నుంచి మనుమలు మనమరాళ్ళ దాకా ఆయన మొక్కల పేర్లే పెట్టారు అంటే ఆయనకు వాటి మీద ఎంత ప్రేమ అన్నది మాటలలో చెప్పనలవి కానిదే.

అలా ఒక మనవరాలి పేరు చందనపుష్ప అయితే మరో మనుమరాలు హరిత లావణ్య అలాగే ఇంకో మనవరాలి పేరు కబంధపుష్ప మరో మనవరాలికి వనశ్రీ అని పేరు పెట్టి రామయ్య మురిసిపోయారు. వన జీవి రామయ్య జీవిత చరిత్రను మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా పాఠ్యాంశంగా పెట్టింది అంటే ఆయన ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నారో అన్నది తెలుస్తుంది.

మహారాష్ట్రలో తొమ్మిదవ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితం వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు. రామయ్య మరణం నిజంగా తీరని లోటు సమాజానికి అని చెప్పాలి.

ఈ రోజున ఆధునిక ప్రపంచంలో కాలుష్యం ఎలా పెంచాలో సులువుగా చేసి చూపించే వారు ఉన్నారు. కానీ మొక్కలను ఎలా పెంచాలి, కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పే నాధుడు అయితే లేరు. అలాంటి చోట భూతాపంతో చెలరేగిపోతున్న ఈ ప్రపంచంలో ఒక తులసి మొక్క రామయ్య. ఆయన మరణం నిజంగా ప్రకృతికి పెను శాపం.

మహాకవి కరుణశ్రీ పూవుల గురించి రాస్తూ వాటి విషాదాన్ని పుష్ప విలాపం చేశారు. ఈ రోజున వన జీవి రామయ్య మరణాన్ని అదే కరుణశ్రీ మొక్కల భావాలను పట్టుకుని కవిత రాస్తే కనుక వృక్ష విలాపం రాసేవారేమో. ఎందరో ఎన్నో రంగాలలో ఒకరు పోతే మరొకరు ఆయా రంగాలలో రావచ్చేమో కానీ ప్రకృతి ప్రేమికుడుగా మొక్కలకు ప్రదాతగా ఉన్న వనజీవి రామయ్య లాంటి వారు మళ్ళీ ఈ భూమి మీదకు రావడం అంటే బహు కష్టం. అయినా అలాంటి వారు రావాలని కోరుకోవాలి. మళ్లీ ఆ వన జీవి రామయ్యే కొత్త జన్మ ఎత్తాలని మొక్కుకోవాలి. ఎందుకంటే అది మన కోసం మన ప్రకృతి కోసం. మన భూమి కోసం.

Tags:    

Similar News