దిగ్గ‌జ నేత‌లు-ఆస్తులు-కొన్ని సంగ‌తులు!

ఎందుకంటే.. ఏది హాట్ టాపిక్ అయితే.. దాని చుట్టూనే రాజ‌కీయాలు, మీడియా కూడా తిరుగుతుంది. అయితే.. ఏపీలో ఎంతో మంది దిగ్గ‌జ నాయ‌కులు ఉన్నారు.

Update: 2024-10-30 15:30 GMT

ఏపీలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంలో త‌లెత్తిన ఆస్తుల వివాదం.. రోడ్డు కెక్కింది. ర‌భ‌స‌గానూ మారిం ది. దీనిపై వైఎస్ కుటుంబానికి అనుకూల‌, వ్య‌తిరేక మీడియా వ‌ర్గాలు త‌మ ప్ర‌చారం తాము చేస్తున్నాయి. దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. ఎందుకంటే.. ఏది హాట్ టాపిక్ అయితే.. దాని చుట్టూనే రాజ‌కీయాలు, మీడియా కూడా తిరుగుతుంది. అయితే.. ఏపీలో ఎంతో మంది దిగ్గ‌జ నాయ‌కులు ఉన్నారు. వారిలో ఎవ‌రూ కూడాఇలా వీధిన ప‌డి పోరాటాలు చేసుకున్న వార‌సులు లేరు.

ఉదాహ‌ర‌ణ‌కు కొంద‌రు..

ఎన్టీఆర్‌: ఇటు సినిమా, అటు రాజ‌కీయాల్లోనూ ఒక చ‌రిత్ర సృష్టించిన అన్న‌గారు ఎన్టీఆర్‌.. జీవించి ఉన్న‌ప్పుడే.. త‌న ఆస్తుల‌ను పంచేశారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ముందు.. 1980లోనే అన్న‌గారు పంచేసి.. త‌ర్వాత రాజ‌కీయ బాట ప‌ట్టారు. అప్ప‌ట్లో ఉన్న కొన్ని రాజ‌కీయ కార‌ణాల‌తో ఆయ‌న ఇలా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ్డారు. దీంతో అన్న‌గారి కుటుంబంలో రాజ‌కీయ వివాదం జ‌రిగిందే త‌ప్ప‌.. ఆస్తుల పంచాయ‌తీ బ‌య‌ట‌కు రాలేదు.

రోశ‌య్య‌: ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా, ఆర్థిక మంత్రిగా సుదీర్ఘ కాలం ప‌నిచేసిన కొణిజేటి రోశ‌య్య‌కు కూడా.. ఇద్ద‌రు కుమార్తెలు.. ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. కానీ, ఆస్తుల విష‌యంలో ఎవ‌రూ రోడ్డెక్క‌లేదు. దీనికి కారణం.. ఆయ‌న కూడా ముందే పంచేశారు. పైగా రాజ‌కీయంగా ఎవ‌రినీ ఆయ‌న ప్రోత్స‌హించ‌లేదు.

ప‌బ్బ‌తి రెడ్డి జ‌నార్ద‌న్ రెడ్డి: కాంగ్రెస్ నాయ‌కుడు. ఈయ‌న కూడా హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. అప్ప‌టికి కుమారుడు, కుమార్తె చిన్న‌పిల్ల‌లు. వీరి కుటుంబంలో ఆస్తుల పంచాయ‌తీ రాలేదు. దీనికి కార‌ణం.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మ‌క్షంలో కుటుంబంలో సుహృద్భావ వాతావ‌ర‌ణంలో పంచేసుకుంది.

పుచ్చ‌ల ప‌ల్లి సుంద‌ర‌య్య‌: క‌మ్యూనిస్టు భీష్మ‌పితామ‌హుడిగా పేరొందిన సుంద‌ర‌య్య సొంతంగా సంపాయించిన ఆస్తిలేదు. వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తులే అప్ప‌ట్లో కొన్ని వేల కోట్ల మేర‌కు ఉన్నాయి. వార‌సుల‌ను వ‌ద్దుకుని కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ చేయించుకున్నాక వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. కేంద్రంలోని ఇందిరా గాంధీ ప్ర‌భుత్వం భూప‌రిమితి చ‌ట్టం చేసిన‌ప్పుడు.. త‌న పేరిట వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తుల‌ను పేద‌ల‌ను పంచేసి.. నెల్లూరులో ప్ర‌జావైద్య శాల‌ను క‌ట్టించి.. దానిని కూడా ప్ర‌జ‌ల‌కు ఇచ్చేసి.. చేతులు దులుపుకొన్నారు.

చండ్ర రాజేశ్వ‌ర‌రావు: ఈయ‌న కూడా క‌మ్యూనిస్టు ఉద్య‌మ పితామ‌హుడే. కుటుంబానికి ఇవ్వాల్సింది ఏమీ లేద‌ని నిరాఘాటంగా చెప్పుకొచ్చారు. ``నేను తెచ్చింది లేదు. తీసుకువెళ్లేది కూడా లేదు`` అని వీలు నామా రాసుకున్నారు. త‌న‌కు ఉన్న చిన్న‌పాటి ఇంటిని పార్టీకి, తాను కొనుక్కున్న నాలుగు జ‌త‌ల దుస్తుల‌ను పేద‌ల‌కు, త‌న ఇంటి సామ‌గ్రిని, పుస్త‌కాల‌ను కూడా.. పార్టీకి ఇచ్చేశారు. ఆయ‌న రాసిని వీలునామా బ‌హిరంగం. విజ‌య‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం ఎదురుగా ఉన్న చండ్ర రాజేశ్వ‌ర‌రావు కాంస్య విగ్ర‌హానికి న‌లువైపులా.. రాతిపై ఈ వీలునామా చెక్కి ఇప్ప‌టికీ ఉంది. ఎవ‌రైనా చూసుకోవ‌చ్చు.

న‌ల్లారి కిర‌ణ్‌: మాజీ సీఎంగా జీవించి ఉన్న నాయ‌కుడు. ఈయ‌న కు కూడా.. కుటుంబం ప‌రంగా వ‌చ్చిన ఆస్తులు.. సంపాయించుకున్న ఆస్తుల‌ను కుటుంబం ఏనాడో పంచేసుకుంది. వివాద ర‌హితంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా.. అనేక మంది నాయ‌కులు ఆస్తుల వివాదాల‌ను రాజ‌కీయ కుంప‌ట్లు గా మ‌లుచుకోలేదు. కానీ, వైఎస్ కుటుంబ‌మే తొలిసారి ఏపీలో రాజ‌కీయ ర‌చ్చ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News