ఆ లెటర్ల ప్రచారంలో నిజం ఎంత?
తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ హై కమాండ్ సస్పెండ్ చేసినట్టు సోషల్ మీడియాలో కొన్ని లెటర్లు వైరల్ అయ్యాయి. అతన్ని పార్టీ నుంచి తొలగించినట్టు ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ నుంచి పలువురు నియోజకవర్గ ఇన్చార్జిలను మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏకంగా అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం కలకలం రేపింది. అసలు ఆర్కే రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీలో ఇంటర్నల్‌గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేక వేరే కారణాలతో అలా చేశాడా? అన్నది అందరిలో ఆసక్తి రేకిస్తున్నది. ఈ క్రమంలోనే వైసీపీ పేరిట లెటర్లు బయటకు వచ్చాయి. అసలు వాటిలో ఏముందన్న దానిపై హైకమాండ్ స్పందించింది.
అసలు కారణం ఏంటి?
వైసీపీ మంగళగిరి ఇన్ చార్జి గంజి చిరంజీవిని నియమించడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలమ తన పదవి కి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ పై ఎలాంటి విమర్శలు చేయలేదు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ హై కమాండ్ సస్పెండ్ చేసినట్టు సోషల్ మీడియాలో కొన్ని లెటర్లు వైరల్ అయ్యాయి. అతన్ని పార్టీ నుంచి తొలగించినట్టు ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.
దీనిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కొందరు కావాలనే పని గట్టుకొని ఎమ్మెల్యే ఆర్కేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లెటర్లలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తి గత కారణాలతో ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారని, ఆయనను సస్పెండ్ చేయడం గానీ, పార్టీ నుంచి తొలగించడం కానీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
అందుకే రాజీనామా చేశాడా?
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాల వారీగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తీసుకున్న నిర్ణయంతో ఆర్కే మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు వినికిడి. కాగా, ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసినా ఆ పార్టీ శ్రేణులు ఆర్కేను విమర్శించడం లేదు. పైగా ఆయన చేసిన పనులను, అభివృద్ధిని మెచ్చుకోవడం గమనార్హం.
ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా ఇటు టీడీపీ, జనసేన, అటు వైసీపీ దృష్టిని ఆకర్షిస్తుంది. మనస్తాపంతో ఉన్న ఆయనను మన వైపునకు లాక్కోవచ్చని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీ గురించి కూడా ప్రస్తావించలేదు కేవలం మనస్తాపం చెంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.