శభాష్: అంతర్జాతీయ వేదిక మీద 12 ఏళ్ల భారత చిన్నారి అనూహ్య నిరసన

భారత్ లోని మణిపూర్ కు చెందిన ఈ పన్నెండేళ్ల చిన్నారి శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి.. భూగ్రహ భవిష్యత్తును కాపాడాలంటూ ప్లకార్డు ప్రదర్శించటమే కాదు.. పెద్ద గొంతుతో తన నిరసనను తెలియజేశారు.

Update: 2023-12-12 15:58 GMT

పన్నెండేళ్ల వయసు. ఇలాంటి వయసున్న పిల్లల నుంచి ఏం ఆశిస్తాం? వీడియో గేమ్స్.. మొబైల్ ఫోన్ లో వీడియోలు చూడటం.. ఇదేమీ కాదంటే.. తమ ఇష్టాలకు అనుగుణంగా తమకు ఖరీదైన బహుమతులు ఇవ్వాలని కోరుతుంటారు. కానీ.. భారతదేశానికి చెందిన పన్నెండేళ్ల లిసిప్రియా కంగుజం అనే చిన్నారి మాత్రం భిన్నంగా వ్యవహరించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ వేదికగా జరుగుతున్న కాప్ 28 ప్రపంచ వాతావరణ సదస్సులో ఆమె అనూహ్య రీతిలో నిరసన తెలిపి అంతర్జాతీయంగా ఆమె లేవనెత్తిన అంశంపై చర్చ జరిగేలా చేసింది.

భారత్ లోని మణిపూర్ కు చెందిన ఈ పన్నెండేళ్ల చిన్నారి శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి.. భూగ్రహ భవిష్యత్తును కాపాడాలంటూ ప్లకార్డు ప్రదర్శించటమే కాదు.. పెద్ద గొంతుతో తన నిరసనను తెలియజేశారు. తాను కూర్చున్న చోటు నుంచి వేగంగా నడుచుకు వచ్చిన లిసిప్రియా.. వేదిక మీదకు నేరుగా వెళ్లిపోయారు. ప్లకార్డును ప్రదర్శిస్తూ తాను చెప్పాలనుకున్న విషయాన్ని గట్టి గొంతుతో చెప్పింది. వేదిక మీద కూర్చొని నిరసన తెలిపే సమయానికి అక్కడకు వచ్చిన భద్రతా సిబ్బందిని పట్టించుకోకుండా తన ప్రసంగాన్నిఆమె కొనసాగించింది. అనంతరం ఆమెను అక్కడి సిబ్బంది వేదిక మీద నుంచి తీసుకెళ్లారు.

ఆ వెంటనే.. సభలోని వారంతా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమె వాదనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాప్ 28 డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న డైరెక్టర్ జనరల్ అంబాసిడర్ మజిద్ అల్ సువైదీ స్పందించారు. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని.. ఆమెకు తన చప్పట్లతో మరోసారి అభినందనలు తెలియజేయాలని కోరటంతో.. సభ పెద్ద ఎత్తున చప్పట్లతో మార్మోగింది. ఆమె చేసిన పనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీక్షకులు వీక్షిస్తున్నారు. ఆమె సాహసానికి పలువురు అబ్బురపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. నిరసన తెలిపిన లిసిప్రియా ట్వీట్ చేసి.. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను సభా వేదికపైకివచ్చి నిరసన తెలిపిన దానికి బదులుగా తనను ముప్ఫై నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నట్లుగా ట్వీట్ చేశారు. తాను చేసిన తప్పంతా.. శిలాజ ఇంధనాలు వాడొద్దని మాత్రమేనని.. అదే పెద్ద నేరమైందన్నారు. శిలాజ ఇంధనాల్ని వ్యతిరేకించే వారంతా తనకు మద్దతు ఇవ్వాలన్న ఆమె.. నిబంధనలకు విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి వేదిక మీదనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగిందన్నఆరోపణను కొత్త చర్చగా మార్చారు. నవంబరు 30న మొదలైన కాప్ 28 సస్సు ఇవాళ(డిసెంబరు 12న) ముగియనుంది. ఈస్ట్ తైమూర్ ప్రత్యేక రాయబారిగా లిసిప్రియా ఈ సదస్సుకు హాజరయ్యారు. చిన్న వయసు నుంచే వాతావరణ మార్పులు.. గ్లోబల్ వార్మింగ్ లాంటి అంశాలపై తను గళం విప్పి పోరాడుతోంది.

Tags:    

Similar News