మద్యం గుట్టు విప్పేస్తారా? విజయసాయిపై వైసీపీ అనుమానాలు
మద్యం స్కాంలో కీలక వ్యక్తిగా అనుమానిస్తున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి పరార్ తో సిట్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.;

మద్యం స్కాంలో వైసీపీ అనుమానిస్తున్నట్లే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా? గత ప్రభుత్వంలో మద్యం స్కాం జరిగిందని కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా పావులు కదుపుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించేందుకు ఈ నెల 18న రావాల్సిందిగా సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నోటీసుల ఓ విధంగా విజయసాయిరెడ్డికి షాకింగ్ గానే చెప్పాలంటున్నారు. కానీ, ఇప్పటికే మద్యం స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి లోగుట్టు విప్పేయడంతో సిట్ ముందు ఇంకేమి చెబుతారనేది ఉత్కంఠ రేపుతోంది.
మద్యం స్కాంలో కీలక వ్యక్తిగా అనుమానిస్తున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి పరార్ తో సిట్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ స్కాంపై బహిరంగ ప్రకటన చేసిన విజయసాయిరెడ్డిని విచారించేందుకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం విజయసాయిరెడ్డి ఈ నెల 18న సిట్ ఎదుట హాజరుకావాల్సివుంది. అయితే మద్యం స్కాంలో విజయసాయిరెడ్డిని నిందితుడిగా అనుమానిస్తూ నోటీసులు జారీ చేశారా? లేక సాక్షిగా పరిగణిస్తున్నారా? అన్నది స్పష్టం కాలేదు. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. మద్యం స్కాంలో ఆయన పాత్ర ఉందంటూ టీడీపీ, జనసేన, బీజీపీ గతంలో ప్రకటనలు చేశాయి. అయితే మారిన రాజకీయ పరిణామాలతో విజయసాయిరెడ్డి సాక్షిగా మారే అవకాశాలు ఉన్నాయనే టాక్ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి.
గతంలో కాకినాడ లిక్కర్ స్కాంలో విచారణకు వెళ్లిన విజయసాయిరెడ్డి.. సీఐడీ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించారు. తాను రాజకీయ సన్యాసం తీసుకున్నందున గతంలో జరిగిన అంశాలన్నీ చెప్పేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. సీఐడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మద్యం స్కాంపై కీలక ప్రకటన చేశారు. విజయసాయిరెడ్డి ప్రకటనతో మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఉచ్చుబిగిసింది. ఇప్పటికే ఆయనను విచారించేందుకు మూడుసార్లు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు సహకరించాలని హైకోర్టు కూడా సూచించింది. అయితే అరెస్టు భయంతో ఆయన ప్రస్తుతం పరార్ అయ్యారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణకు సిట్ సిద్ధమవడం రాజకీయంగా ప్రాధాన్యత పెంచుతోంది.
వైసీపీలో క్రియాశీలంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత.. పలు కుంభకోణాల్లో తన పేరు బయటకు వస్తుండటంతో టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. తన ప్రమేయం లేకుండానే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు ఇప్పుడు తనను ఇరికించే కుట్ర చేస్తున్నారని విజయసాయిరెడ్డి అనుమానిస్తున్నారు. దీంతో తాను రాజకీయాల నుంచి వైదొలగి ప్రభుత్వానికి సహరించి క్షేమంగా బయటపడాలని వ్యూహం రచించారని అంటున్నారు. దీంతో రెండు నెలల క్రితమే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కాకినాడ సీపోర్టు కేసులో సీఐడీ విచారణకు హాజరై తను ప్రకటించినట్లు ప్రభుత్వానికి సహకరించారని అంటున్నారు. దీంతో లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి చెప్పే సమాచారం కోసం ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోందని చెబుతున్నారు. వైసీపీలో కీలక నేతలను ఇరికించేలా విజయసాయిరెడ్డి ఏమైనా వాంగ్మూలమిస్తారా? అనేది ఉత్కంఠ పెంచుతోంది. ఈ పరిణామాలు వైసీపీ హైకమాండ్ ను కూడా టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పీకల్లోతు ఇరుక్కున్న రాజ్ కసిరెడ్డిని కాపాడేందుకే ఆ పార్టీ ఆపసోపాలు పడుతోందని అంటున్నారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం సుప్రీంకోర్టు వల్ల రక్షణ పొందారు. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఎలాంటి బాంబు పేల్చుతారోననేది టెన్షన్ పుట్టిస్తోందని అంటున్నారు.