అమెరికాలో 'లిటిల్ రెడ్ బుక్' హల్ చల్!
ఈ సమయంలో టిక్ టాక్ స్థానంలో మరో యాప్ సందడి మొదలైందని చెబుతున్నారు. అదే.. లిటిల్ రెడ్ బుక్!
అగ్రరాజ్యం అమెరికాలో టిక్ ట్యాక్ బ్యాన్ అనే విషయం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే జరిగితే సుమారు 17 కోట్ల మంది యూజర్లు ఇకపై అమెరికాలో ఈ టిక్ టాక్ యాప్ ను యాక్సిస్ చేయలేరని అంటున్నారు. ఈ సమయంలో టిక్ టాక్ స్థానంలో మరో యాప్ సందడి మొదలైందని చెబుతున్నారు. అదే.. లిటిల్ రెడ్ బుక్!
అవును... కొన్నేళ్ల క్రితం టిక్ టాక్ ను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా నాడు భారత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో తాజాగా అమెరికా కూడా ఆ దిశగా ముందుకు వెళ్తుందని అంటున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందు.. ఈ నెల 19న టిక్ టాక్ పై నిషేధం అమల్లోకి రానుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో మిలియన్ల కొద్దీ అమెరికన్ వినియోగదారులు టిక్ టాక్ ప్రత్యామ్నాయా ఆప్షన్ల కోసం వెతకడం ప్రారంభించారని అంటున్నారు. ఈ సమయంలో చైనాకు చెందిన మరో యాప్ డౌన్ లోడ్ లు అమెరికాలో భారీగా పెరిగాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. దీని పేరు ‘జియాహోంగ్షు’ కాగా.. దీన్ని ‘లిటిల్ రెడ్ బుక్’ అని కూడా పిలుస్తారు.
ఈ యాప్ ఇటీవల ఆపిల్ యాప్ స్టోర్ డౌన్ లోడ్ చార్ట్ లో అగ్రస్థానంలో నిలిచిందని.. అగ్రరాజ్యంలో టిక్ టాక్ కు దీన్ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే ఈ యాప్ అతి తక్కువ సమయంలో అమెరికాలో బాగా పాపులర్ అవుతుందని చెబుతున్నారు. ఈ యాప్ ను చైనాలో ఇప్పటికే సుమారు 300 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకొన్నారు.
టిక్ టాక్ ను మస్క్ కొనుగోలు చేస్తారా?:
గత కొన్ని రోజులుగా టిక్ టాక్ నిషేధం వార్తలు హల్ చల్ చేస్తున్న వేళ.. ఈ టిక్ టాక్ ను ఎలాన్ మస్క్ కు అమ్మాలని చైనీస్ కంపెనీ చూస్తుందనే చర్చా తెరపైకి వచ్చింది. అయితే... టిక్ టాక్ ప్రతినిధి మాత్రం మస్క్ కు టిక్ టాక్ అమెరికా బిజినెస్ ను విక్రయించే ఆలోచన లేదని చెబుతున్నారు.