తమ్ముళ్ళకు గుడ్ న్యూస్... నామినేటెడ్ పోస్టులు రెడీ

అలాగే జనసేన బీజేపీ నుంచి కూడా తమకు నామినేటెడ్ పోస్టులలో తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్న వారి నంబరేమీ తక్కువగా లేదు.

Update: 2025-01-16 08:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. దీని వల్ల చాలా మంది ఆశావహులకు న్యాయం జరిగింది. అయితే మరింతమంది త్యాగమూర్తులు ఉన్నారు. కూటమిలోని మూడు పార్టీలూ ఎంతో ఆశగా ఈ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నాయి. టీడీపీలో అయితే భారీగానే లిస్ట్ ఉంది. అలాగే జనసేన బీజేపీ నుంచి కూడా తమకు నామినేటెడ్ పోస్టులలో తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్న వారి నంబరేమీ తక్కువగా లేదు.

ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ క్యాడర్ కి తీపి కబురు అందించారు. నామినేటెడ్ పదవుల భర్తీ ఈ నెలాఖరులో ఉంటుందని ఆయన చెప్పారు. నారావారిపల్లెలో జరిగిన చంద్రగిరి నియోజకవర్గం పార్టీ నాయకుల సమావేశంలో లోకేష్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలను చేశారు

పదవుల కోసం తమ్ముళ్ళు ఆశిస్తున్నారని అయితే పార్టీ తప్పకుండా అందరినీ గుర్తు పెట్టుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీలో పదవులు అన్నవి విధేయతతో పాటు కష్టించి పనిచేసిన వారికి కచ్చితంగా దక్కుతాయని ఆయన భరోసా ఇచ్చారు. అన్ని అంశాలను పరిశీలించిన మీదట సమర్ధులకు పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇస్తామని లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

దీంతో తమ్ముళ్ళలో ఆనందం వెల్లి విరుస్తోంది. నిజానికి నామినేటెడ్ పదవుల భర్తీ అన్నది సంక్రాంతి ముందే చేస్తారు అని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. సంక్రాంతి కానుకగా తమ్ముళ్లకు స్వీట్ న్యూస్ చెబుతారు అని అనుకున్నారు. ఈ మేరకు కసరత్తు కూడా పూర్తి అయింది అనుకున్నారు

అయితే ఈ మధ్యలో తిరుపతి తొక్కిసలాట జరగడంతో ఇష్యూ మొత్తం డైవర్ట్ అయింది అని అంటున్నారు. ఆ తరువాత పండుగ తోసుకుని రావడంతో ఆ వూసే అంతా మరచిపోయారు ఇక చూస్తే చంద్రబాబు లోకేష్ ఇద్దరూ దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ కి వెళ్తున్నారు. ఈ నెల 24న తిరిగి ఇద్దరూ ఏపీకి వస్తారు. అలా వచ్చిన వెంటనే ఒకటి రెండు రోజుల వ్యవధిలో నామినేటెడ్ పదవుల లిస్ట్ ని ఫైనలైజ్ చేసి నెలాఖరులోగా పదవులు భర్తీ చేస్తారు అని అంటున్నారు.

ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆశావహులు అంతా ఆషామాషీ నేతలు అయితే కారు, మాజీ మంత్రులు సీనియర్ నేతలు ఎమ్మెల్యే పదవులు చేసిన వారు ఉన్నారు. దాంతో వీరందరికీ తగిన హోదా ఇవ్వడం అన్నది కష్టసాధ్యమైన విషమే. దాంతో పాటుగా జనసేన బీజేపీల నుంచి కూడా సీనియర్లు పోటీలో ఉన్నారు. అందరికీ సమన్యాయం చేస్తూ కీలకమైన పదవులు భర్తీ చేయడం అన్నది కత్తి మీద సాము లాంటి వ్యవహారం.

దాంతోనే ఇంత టైం పడుతోంది అని అంటున్నారు. ఇక ఈసారి లిస్ట్ లో మాత్రం చాలా విశేషాలు ఉంటాయని బడా నేతలకు పదవులు దక్కుతాయని దాంతో ఫుల్ జోష్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి లోకేష్ ప్రకటించారు కాబట్టి నామినేటెడ్ పదవుల భర్తీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల ముగియకుండానే పదవులు దక్కే చాన్స్ అయితే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News