ఐదేళ్లు రెడ్ బుక్ అమలులోనే.. మంత్రి లోకేశ్ సీరియస్ వార్నింగ్
తన పాదయాత్రలో 90 బహిరంగ సభల్లో రెడ్ బుక్ కోసం చెప్పానని.. ఆ ప్రకారమే చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు.
వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అరాచకంగా వ్యవహరించిన అధికారులు, నేతలపై రెడ్ బుక్ ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. తన పాదయాత్రలో 90 బహిరంగ సభల్లో రెడ్ బుక్ కోసం చెప్పానని.. ఆ ప్రకారమే చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్ధన్ ను బెదిరించి కేసు ఉపసంహరించుకునేలా చేసినందుకు వంశీని అరెస్టు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా తమ ఐదేళ్ల పాలనలో రెడ్ బుక్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారని లోకేశ్ మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి ప్రజలు, ప్రతిపక్ష నేతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ధ్వజమెత్తారు. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పాలన జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేతలు, ప్రజా నాయకులు వెళితే వారిని ఇబ్బందులకు గురిచేసి వేధించారని ఆగ్రహించారు.
గత ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని సైతం బయటకు రానివ్వకుండా ఇంటి గేట్లను తాళ్లతో కట్టారని ఆరోపించారు. మంగళగిరి, గన్నవరం పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని గుర్తు చేశారు. ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లోకేశ్ తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు అవుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. రెడ్ బుక్ పేరిట వైసీపీ నేతలు, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శలు చేస్తోంది. ఇలా ఆ పార్టీ ఎన్ని విమర్శలు చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం వైసీపీ నేతలపై నమోదయ్యే కేసుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు నేతలపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. దీంతో వైసీపీ నేతల్లో చాలా మంది కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూనే తిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక గత ప్రభుత్వంలో నోటి దురుసుతో వ్యవహరించిన వల్లభనేని వంశీని అరెస్టు చేయడం టీడీపీ నేతలకు పెద్ద సవాల్ గా మారింది. ఇప్పుడు ఆ టార్గెట్ రీచ్ కావడంతో నెక్ట్స్ ఎవరన్న చర్చ జరుగుతోంది. మంత్రి లోకేశ్ కామెంట్స్ తో అరెస్టు కొనసాగుతాయని మరోమారు స్పష్టం చేసినట్లైందని అంటున్నారు.