ఏమిటా బిగ్ అనౌన్స్ మెంట్.. హాట్ టాపిక్ గా లోకేశ్ ట్వీట్

అలాంటి ఆయన తాజాగా ఒక ట్వీట్ పోస్టు చేసి అందరు తన వైపు చూసేలా చేశారు.

Update: 2024-10-09 06:08 GMT

ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరుకు భిన్నంగా స్పందించారు ఏపీ మంత్రి లోకేశ్. కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత లోకేశ్ తీరులో చాలానే మార్పు వచ్చింది. సంచలనాలు.. అందరూ తన వైపు చూసేలా చేయటం లాంటివి కాకుండా.. వీలైనంత లో ప్రొఫైల్ తో తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అలాంటి ఆయన తాజాగా ఒక ట్వీట్ పోస్టు చేసి అందరు తన వైపు చూసేలా చేశారు. మంగళవారం టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ చంద్రశేఖరన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశం అద్భుతంగా జరిగిందని పేర్కొన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికర ట్వీట్ పోస్టు చేశారు. ‘బుధవారం బిగ్ అనౌన్స్ మెంట్ ఉంది. వెయిట్ చేయండి’ అంటూ ఒక ట్వీట్ పోస్టు చేశారు. దీంతో లోకేశ్ నుంచి వెలువడే ప్రకటన ఏమిటన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత చంద్రశేఖరన్ తో లోకేశ్ భేటీ కావటం ఇది రెండోసారి. దీంతో.. ఐటీకి సంబంధించిన ఒక మెగా ప్రాజెక్టుకు ఓకే చెప్పి ఉంటారా? అన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

రాబోయే ఐదేళ్లలో ఏపీలోని యువతకు 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించటమే ప్రభుత్వ లక్ష్యంగా లోకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి సహకరించే అన్ని రకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాల్ని అందిస్తామని చెబుతున్నారు. లోకేశ్ ప్రతిపాదనలపై చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సానుకూలంగా ఉన్నామని.. పూర్తి స్థాయి ప్రతిపాదనలతో మరోసారి కలుస్తామని హామీ ఇచ్చారు.

దీంతో.. వీరి భేటీపై ఆసక్తి నెలకొంది. చూస్తుంటే.. టాటా గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై కీలక ప్రకటన వెలువడే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రోజు వ్యవధిలో తండ్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధానితో పాటు పలువురు ముఖ్యుల్ని కలుస్తూ.. రాష్ట్ర అవసరాలకు సరిపడే నిధుల కోసంప్రయత్నిస్తుంటే.. మరోవైపు కొడుకు లోకేశ్ ఏపీలో మెరుగైన సంస్థలతో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్ పై తెలుగువారిలో ఆసక్తి నెలకొంది. మరేం ప్రకటన చేస్తారో చూడాలి.

Tags:    

Similar News