మండలిలో మంట: లోకేష్ వర్సెస్ వైసీపీ
ఈ సమయంలో వైసీపీ ఫోర్ల్ లీడర్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారని అన్నారు.
శాసన సభ బడ్జట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో మంగళవారం.. మంత్రి నారా లోకేష్ వర్సెస్ వైసీపీ సభ్యుల మధ్య వాడివేడి వాగ్యుద్ధం జరిగింది. కేంద్రం నుంచి రాష్ట్రం వరకు.. అనేక విషయాలను వైసీపీ నాయకులు వరుస పెట్టి ప్రశ్నించారు. దీనికి నారా లోకేష్ సమర్థవంతంగా సమాధానం చెప్పారు. తొలుత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చైర్మన్ మోషేన్ రాజు చర్చ చేపట్టారు. ఈ సమయంలో వైసీపీ ఫోర్ల్ లీడర్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారని అన్నారు.
ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోయినా.. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పించారని బొత్స వ్యాఖ్యానించారు. దీనికివైసీపీ మరో సభ్యురాలు వరుదు కళ్యాణి వంత పాడుతూ.. ఔను.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా.. వైసీపి ఇచ్చిన వాటిని కూడా.. తమ ఖాతాలో వేసుకుంటున్నారని వాదించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న నారా లోకేష్.. తాము అలా చెప్పలేదని.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామని మాత్రమే చెప్పామన్నారు.
అనంతరం.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం టీడీపీ పై ఆధారపడి ఉందన్న వైసీపీ ఎమ్మెల్సీల వాదనను కూడా నారా లోకేష్ బలంగా తిప్పికొట్టారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తమపై ఆధారపడి లేదని చెప్పారు. అంతేకాదు.. తాము ఎన్నికలకు ముందే.. ఎన్డీయేలో చేరామని.. ఎలాంటి షరతులు పెట్టలేదని.. కాబట్టి.. ప్రత్యేక హోదాకు.. షరతులకు ముడిపెట్టలేదన్నారు. అయితే.. నారా లోకేషష్ మాట్లాడుతున్న సమయంలో పదే పదే వైసీపీ సభ్యులు కూడా మైకు కోసం ప్రయత్నించారు.
దీంతో మండలిలో ఇరు పక్షాల మద్య వాగ్యుద్ధం జోరుగా సాగింది. జనాలపై 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై నారా లోకేష్.. దీటుగా సమాధానం చెప్పారు. ఇదంతా వైసీపీ చేసిన పాపాల వల్లే జరిగిందన్నారు. ఆనాడు ఎక్కువ ధరలకు ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక, మాతృవందనం పథకాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ విమర్శించగా.. మీరు కూడా అమ్మ ఒడి పథకాన్ని ఏడాది తర్వాతే ప్రారంభించారని లోకేష్ గుర్తు చేశారు. ఇలా.. ఒకరికి ఒకరు మాటా మాటా అన్నట్టుగా మండలిలో పోరు సాగడం గమనార్హం.