వర్మ గురించి లోకేష్‌ను స్పందించమంటే..?

కాగా చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం యువ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తాజాగా మీడియా ముందు ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భంగా వర్మ చేసే విమర్శలు,

Update: 2023-10-28 15:48 GMT

ఒకప్పుడు శివ, సత్య, సర్కార్, కంపెనీ లాంటి చిత్రాలతో తెలుగే కాక ఇండియన్ సినిమానే గొప్ప మలుపు తిప్పిన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ఎంత గొప్ప పేరుండేదో తెలిసిందే. కానీ గత పది పదిహేనేళ్లలో చెత్త చెత్త సినిమాలతో తనకున్న పేరు మొత్తం దెబ్బ తీసుకున్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ఒకప్పుడు అలాంటి సినిమాలు తీసిన మీరు ఇప్పుడీ చిత్రాలు తీయడం ఏంటి అని అడిగితే.. నచ్చితే చూడండి, లేదంటే లేదు అంటూ సమాధానం చెప్పి నోళ్లు మూయిస్తాడు వర్మ. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడాయన ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీకి కార్యకర్తలా మారిపోయి తెలుగుదేశం, జనసేనలను ఎలా టార్గెట్ చేస్తున్నాడో తెలిసిందే.

ఇప్పటికీ తాను న్యూట్రల్ అన్నట్లుగా కలరింగ్ ఇచ్చే వర్మకు కేవలం టీడీపీ, జనసేన తప్పులు మాత్రమే కనిపిస్తాయి. ఆయన పెట్టే పోస్టులు మరీ విడ్డూరంగా, వెటకారంగా అనిపిస్తుంటాయి. తాజాగా చంద్రబాబు ఉన్న రాజమండ్రి జైలు ముందుకు వెళ్లి సెల్ఫీ తీసుకుని వ్యంగ్యంగా ఏదో పోస్టు పెట్టాడు వర్మ.

కాగా చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం యువ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తాజాగా మీడియా ముందు ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భంగా వర్మ చేసే విమర్శలు, ఆయన తాజాగా పెట్టిన పోస్టుల గురించి విలేకరులు ప్రస్తావించారు. దీని మీద మీ స్పందనేంటి అని అడిగారు. అందుకాయన బదులిస్తూ.. వర్మకు నేను సమాధానం ఇవ్వడం ఏంటి, భలేవాళ్లే అంటూ ఆర్జీవీ గురించి చాలా తేలిగ్గా మాట్లాడాడు. చంద్రబాబు గురించి విమర్శలు చేసే స్థాయా వర్మది అని ప్రశ్నించాడు.

చంద్రబాబు సైబరాబాద్ కట్టి లక్షల మందికి ఉపాధి కల్పించాడని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీకి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలమందికి ఉద్యోగాలు తెప్పించాడని.. ఇలా సమాజానికి చంద్రబాబు ఎంతో చేశాడని.. మరి వర్మ సొసైటీకి చేసిన మేలేంటని లోకేష్ ప్రశ్నించాడు. ఇలాంటి వ్యక్తికి నేను సమాధానం చెప్పేదేంటి అని కొట్టిపడేశాడు.

మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును 50 రోజులకు పైగా జైల్లో పెట్టడం గురించి లోకేష్ మాట్లాడుతూ.. "31 కేసులు, అందులో 11 సీబీఐ, 7 ఈడీ కేసులతో పదేళ్ల నుండి బెయిల్ మీద ఉంటూ.. అందులో ఐదేళ్ల నుండి కనీసం విచారణకు కూడా వెళ్లకుండా జగన్ ఎలా వున్నాడు ? కనీసం మనీ ట్రయల్ జరిగిందనే ప్రాధమిక ఆధారం కూడా లేకుండా బాబు గారు లోపల ఎలా వున్నారు? అందులోను స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటిదాకా అందరు మాగ్జిమం 38 రోజులే లోపల ఉన్నారు. కానీ ఏ37 అయిన పెట్టిన బాబు గారు 50 రోజులు ఎాలా జైల్లో ఉన్నారు’’ అని లోకేష్ ప్రశ్నించాడు.

Tags:    

Similar News