స్పీకర్ పోస్ట్.. టీడీపీ తప్పుకొంది.. చిన్నమ్మకు దక్కకుంది.. కిం కర్తవ్యం?
18వ లోక్ సభ కొలువుదీరిన వేళ.. స్పీకర్ ఎవరనేది సస్పెన్స్ వీడింది.
18వ లోక్ సభ కొలువుదీరిన వేళ.. స్పీకర్ ఎవరనేది సస్పెన్స్ వీడింది. బీజేపీలోనే కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా? ఎన్డీఏ కూటమి పార్టీల్లో రెండో స్థానంలో ఉన్న పార్టీకి చాన్స్ దక్కుతుందా? ఈ పార్టీ టీడీపీనే అవుతుందా? అనే సందిగ్ధానికి తెరపడింది. బొటాబొటీ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోదీ.. ప్రతిపక్షానికి ఏ అవకావమూ ఇచ్చే ఉద్దేశంలో లేరని తేలిపోయింది. ఈ నేపథ్యంలో 17వ లోక్‌సభ స్పీకర్ గా వ్యవహరించిన ఓం బిర్లాకే మరోసారి చాన్స్ దొరికింది.
టీడీపీ పట్టుబట్టి.. పట్టు విడిచిందా?
లోక్ సభ స్పీకర్ పదవి కోసం ఎన్డీఏలో బీజేపీ తర్వాత స్థానంలో ఉన్న టీడీపీ పట్టుబట్టినట్లు కథనాలు వచ్చాయి. అయితే, రేసు నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నదని చెబుతున్నారు. కేంద్ర సర్కారును అదుపు చేసేందుకు స్పీకర్ పోస్టు అవసరం అని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. దీనికి అనుగుణంగా పావులు కదిపారు. తమ స్పీకర్ అభ్యర్థిని సైతం సిద్ధం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అనూహ్యంగా రేసు నుంచి తప్పుకొన్నారు. స్పీకర్ గా ఎవరిని ఎన్నుకున్నా తాము మద్దతిస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. పదవుల కోసం ఆశపడితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని కారణం చూపారు.
వాస్తవానికి టీడీపీ ఇంకాస్త గట్టి ప్రయత్నించి ఉంటే స్పీకర్ పదవి ఇచ్చేవారేమో? కానీ, చంద్రబాబు అనివార్యతల రీత్యానో, కేంద్రంతో సఖ్యతగా ఉంటూ మున్ముందు పనులు సాధించుకుందామనో గట్టిగా ప్రయత్నించలేదు. ఇదే సమయంలో వివాదరహితుడు కావడంతో ఓం బిర్లాను మరోసారి స్పీకర్ గా నిలిపింది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ. ఓం బిర్లా రాజస్థాన్ లోని కోటా-బూందీ నియోజకవర్గం నుంచి మూడోసారి గెలిచారు.
చిన్నమ్మకు నిరాశే?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి లోక్ సభ స్పీకర్ పదవి ఇస్తారనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. మూడోసారి లోక్ సభకు ఎన్నికవడం, పదేళ్ల కిందటనే కేంద్ర మంత్రి హోదాలో పనిచేసి ఉండడం, ఏపీలో పార్టీ పటిష్ఠత, భవిష్యత్ లోనూ టీడీపీ-జన సేనతో కలిసి వెళ్లాల్సి ఉండడం, దివంగత ఎన్టీఆర్ వంటి గొప్ప నేత కుమార్తె కావడం వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నా.. బీజేపీ అధిష్ఠానం మాత్రం పురంధేశ్వరి కంటే ఓం బిర్లా వైపే మొగ్గుచూపింది. ఇటీవలి కేబినెట్ లోనూ పురంధేశ్వరికి కాకుండా ఏపీలో తొలిసారి గెలిచిన శ్రీనివాసవర్మకు చోటిచ్చారు. దీంతో పురంధేశ్వరి సేవలను రాష్ట్రస్థాయిలో పార్టీ పటిష్ఠానికి వినియోగించుకుంటారనే అభిప్రాయం వస్తోంది.