అంతరిక్షంలో అత్యధిక కాలం ఉన్నది ఇతడే!

ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోనే ఉన్న ఒలెగ్‌ కొనొనెంకో భూమికి తిరిగొచ్చేసరికి వెయ్యి రోజులు అంతరిక్షంలో గడిపినట్లవుతుంది.

Update: 2024-02-05 06:06 GMT

అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్‌ ఒలెగ్‌ కొనొనెంకో(59) రికార్డు సృష్టించారు. 2008 నుంచి ఇప్పటిదాకా ఆయన ఐదుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లారు. ఫిబ్రవరి 4 నాటికి కొనొనెంకో మొత్తం 878 రోజుల 12 గంటలపాటు అంతరిక్షంలో ఉన్నారు. ఈ మేరకు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ 'రాస్‌ కాస్మోస్‌' వివరాలు వెల్లడించింది.

ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోనే ఉన్న ఒలెగ్‌ కొనొనెంకో భూమికి తిరిగొచ్చేసరికి వెయ్యి రోజులు అంతరిక్షంలో గడిపినట్లవుతుంది.

కాగా అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన రికార్డు ఇప్పటివరకు రష్యా పేరుతోనే ఉంది. ఆ దేశానికి చెందిన గెన్నడీ పదల్కా 878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకన్లు అంతరిక్షంలో గడిపారు.

ఇప్పుడు రష్యాకే చెందిన వ్యోమగామి ఒలెగ్‌ కొనొనెంకో అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యక్తిగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టినట్లు రష్యా అంతరిక్ష సంస్థ.. రాస్‌ కాస్మోస్‌ నివేదించింది.

59 ఏళ్ల కొనొనెంకో ఇప్పుడు 878 రోజుల 12 గంటలకు పైగా అంతరిక్షంలో గడిపాడు. దీంతో 2015లో 878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకన్లతో మునుపటి రికార్డును నెలకొల్పిన తోటి రష్యన్‌ గెన్నడీ పదల్కాను అధిగమించారు.

ఇప్పటివరకు కొనొనెంకో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐదు ప్రయాణాలు చేశారు. ఈ నేపథ్యంలో రష్యన్‌ ప్రభుత్వ వార్తా సంస్థతో కొనెనెంకో మాట్లాడారు. వ్యోమగామిని కావాలనే తన చిన్ననాటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. తాను అంతరిక్షంలో వెళ్లింది ఎగరడానికో, రికార్డులు సృష్టించడానికో కాదని.. చిన్నప్పటి నుంచి తాను వ్యోమగామిని కావాలని కలలు కన్నానని చెప్పారు.

ఈ సాహసయాత్ర ముగిసే సమయానికి, అంతరిక్షంలో 1,000 రోజులు గడిపిన మొదటి వ్యక్తిగా కొనెనెంకో రికార్డు సృష్టిస్తారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌ పై రష్యా దాడి చేసిన తర్వాత యునైటెడ్‌ స్టేట్స్, రష్యా ఇప్పటికీ సన్నిహితంగా సహకరించుకుంటున్నవాటిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఒకటి. వ్యోమగాములను అంతర్జాతీయ అంతరక్షి కేంద్రంలోకి పంపడానికి తన క్రాస్‌–ఫ్లైట్‌ ప్రోగ్రామ్‌ ను 2025 వరకు పొడిగించినట్లు గత డిసెంబర్‌ లో ప్రకటించింది.


Tags:    

Similar News