మరోసారి మనసు దోచేసిన లులు గ్రూప్ అధినేత

ఆయన తీరు తెలిసిన వారంతా ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోతుంటారు.

Update: 2024-10-16 06:16 GMT

వ్యాపారవేత్తగా సుపరిచితుడు.. భారీ మాల్స్ ను ఏర్పాటు చేయటం.. వాటిని సమర్థంగా నిర్వహించే విషయంలో తనదైన ముద్ర వేసే టాలెంట్ లులు గ్రూప్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ సొంతం. తన వరకు వచ్చే ఏ సమస్యనైనా.. ఇట్టే తీర్చేసే ఆయన తీరు తరచూ నెటిజన్ల మనసుల్ని దోచుకుంటుంది. ఆయన తీరు తెలిసిన వారంతా ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోతుంటారు. తాజాగా అలాంటి పనే మరొకటి చేశారు.

అప్పు తీర్చలేక ఇల్లు చేజారిపోవటం.. మరోవైపు పిల్లల్ని..బాధ్యతల్ని వదిలేసి భర్త వెళ్లిపోయిన ఒక ఒంటరి మహిళ జీవితాన్ని తిరుగులేని విధంగా తీర్చిదిద్దిన ఆయన పె..ద్ద మనసు గురించి తెలిసిన వారంతా ఫిదా అవుతున్నారు. మెచ్చుకోళ్లతో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే.. కేరళలోని నార్త్ పరవూర్ కు చెందిన సంధ్య 2019లో ఇల్లు కట్టుకోవటానికి ఒక ప్రైవేటు సంస్థ నుంచి రూ.4 లక్షల లోన్ తీసుకుంది. ఇంటి నిర్మాణానికి మరింత డబ్బులు అవసరం కావటంతో మరింత అప్పు చేసింది.

కొంతకాలం గడిచేసరికి.. ఆమె భర్త ఇంటి వదిలి వెళ్లిపోయాడు. పిల్లలు.. వారి బరువు బాధ్యతలు సంధ్య మీదన పడ్డాయి. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన భర్త తీరుతో సంధ్య సమస్యలు మరింత పెరిగాయి. ఆమె కుటుంబ పోషణ కష్టమైంది. దీనికి తోడు ఇంటి అప్పు మరింత ఇబ్బందిపెట్టింది. ఇలాంటి వేళ.. ఇంటి లోన్ కట్టలేకపోవటం.. ఆమె చేసిన అప్పునకు వడ్డీ మొత్తం రూ.8 లక్షలు కావటంతో ఆమె అప్పు తీర్చాలంటూ లోన్ ఇచ్చిన కంపెనీలు ఒత్తిడి పెట్టసాగాయి.

అయితే.. సంధ్య దగ్గర ఆ మొత్తం లేకపోవటంతో రుణం ఇచ్చిన సంస్థలు ఆమె నుంచి ఇంటిని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో.. కట్టుబట్టలతో.. పిల్లలతో రోడ్డు మీద నిలవాల్సిన దుస్థితి. ఆమెకు ఎదురైన కష్టం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ పోస్టు లులు గ్రూపు అధినేత యూసఫ్ అలీ కంట పడింది. వెంటనే స్పందించిన ఆయన.. సంధ్య రుణం మొత్తాన్ని చెల్లించాలని సిబ్బందిని ఆదేశించారు.

అక్కడితో ఆగని ఆయన.. వారి జీవితం సాఫీగా సాగటానికి వీలుగా రూ.10 లక్షల మొత్తాన్ని ఇవ్వాలని ఆర్డర్ వేశారు. దీంతో.. ఆమె కష్టాలు ఒక్క దెబ్బకు తీరిపోయాయి. పోయిన ఇల్లు తిరిగి రావటమే కాదు.. కుటుంబ పోషణకు భారీ మొత్తం అందటంతో నెటిజన్లు ఆయన తీరును విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ఏమైనా.. యూసఫ్ అలీది పెద్ద మనసు అనటంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News