ఏపీ ఎన్నికలు ఒక ఎత్తు.. మాచర్లలో మరో ఎత్తు

ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ఘట్టం ఏపీలో పూర్తైంది. అంచనాలకు తగ్గట్లే ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది.

Update: 2024-05-14 05:30 GMT

ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ఘట్టం ఏపీలో పూర్తైంది. అంచనాలకు తగ్గట్లే ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ వేళ ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పల్నాడు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పలు హింసాత్మక సంఘటనలుచోటు చేసుకున్నాయి. పోలింగ్ వేళ కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చివరకు రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కత్తులు.. గొడ్డళ్లతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన వైనం షాకింగ్ గా మారింది.

పోలింగ్ స్టేషన్ ల వద్ద వందల మందితో స్వైర విహారం చేసిన మూకలు.. అడ్డొచ్చిన వారిని వాహనాలతో గుద్దేసేందుకు సైతం వెనుకాడకపోవటం సంచలనంగా మారింది. ఇలాంటి వేళ.. అధికార వైసీపీ.. విపక్ష టీడీపీకి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి దిగగా.. తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మారెడ్డి నిలిచారు. అధికార పార్టీకి చెందిన కొందరి కారణంగా ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. వీటి స్థానంలో ఎన్నికల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావటానికి ఇష్టపడకపోవటం గమనార్హం.

పోలింగ్ వేళ మాచర్లలో చోటు చేసుకు్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయి. పోలింగ్ ప్రారంభమైన వేళ రెంటచింతల మండటం రెంటాలలో ముగ్గురు టీడీపీ ఏజెంట్లపై కత్తులు.. గొడ్డళ్లతో దాడులకు పాల్పడగా.. అందులో టీడీపీకి చెందిన మహిళా ఏజెండ్ ముఖంపై గొడ్డలితో నరికారు. ఆమె భర్త పైనా దాడికి పాల్పడ్డారు. పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ చేస్తుండగా అక్కడకు వచ్చిన ముగ్గురు టీడీపీ ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. ఎంత ధైర్యం ఉంటే టీడీపీ ఏజెంట్లుగా కూర్చుంటారని ప్రశ్నించిన వారు.. మహిళపై దాడికి పాల్పడటం.. పెద్ద గాయం కావటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.

మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి సోదరుల సొంత గ్రామమైన వెల్దుర్తి మండలం కండ్లకుంటలో పోలింగ్ ప్రారంభమైన అరగంటకే సీసీ కెమేరాలు పని చేయకుండా విద్యుత్ సరఫరాను నిలిపేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఏజెంట్లను బయటకు పంపి ఓట్లు వేసుకున్న వైనం వివాదాస్పదంగా మారింది. ఇదే విధంగా నియోజకవర్గంలోని పలు చోట్ల ఇలాంటి పరిస్థితినెలకొంది. టీడీపీ ఏజెంట్లకు బెదిరింపులు.. హెచ్చరికలు.. దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.

రెంటచింతల మండలంలోని పలు చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ కాసేపు నిలిచిపోయింది. అనంతరం పోలింగ్ మొదలుపెట్టారు. కారంపూడి మండలంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై జరిగిన దాడిలో ఆరు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో ధ్వంసం అయిన కార్లతో అభ్యర్థి బ్రహ్మారెడ్డి.. మాచర్లలోని మరో టీడీపీ నేత కేశవరెడ్డి ఇంటికి చేరుకున్నారు. దీంతో వైసీపీకి చెందిన పలువురు కేశవరెడ్డి ఇంటిపైకి దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఇంటి బయటకు వచ్చిన కేశవరెడ్డి.. ఆయన అనుచరులను కారుతో తొక్కించుకుంటూ వెళ్లిన ఉదంతంలో ఏడుగురు గాయపడ్డారు. ఈ టైంలో కేశవరెడ్డి గన్ మెన్ అప్రమత్తమై ఫైరింగ్ చేసేందుకు సిద్ధం కాగా.. దాడికి పాల్పడిన వారు వెళ్లిపోయారు.

రెంటచింతల మండలం పాల్వాయిగేటులో టీడీపీ వర్గీయుల్ని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఈ పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కం అభ్యర్థి అయిన పిన్నెల్లి తన అనుచరులతో పోలింగ్ బూత్ లకు వచ్చి టీడీపీ వారిని ఈడ్చిపడేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంతో టీడీపీ వారు ఎమ్మెల్యే కారుపై రాళ్లు విసిరినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు అద్దాలు పగిలిపోగా.. ఎమ్మెల్యే కొడుక్కి రాయి తగిలి గాయమైంది. టీడీపీ అభ్యర్థి బ్రాహ్మరెడ్డి పౌ దాడికి పాల్పడటమే కాదు.. ఆయన కళ్లలోకి కారం కొట్టి దాడి చేసే ప్రయత్నం చేయగా.. వాటి నుంచి తప్పించుకున్నారు. బ్రహ్మారెడ్డి కాన్వాయ్ లోని ఒక కారును కాల్చేసిన వైనం ఉద్రిక్త పరిస్థితికి కారణమైంది.

Tags:    

Similar News