బీజేపీ మాధవీ లత వర్సెస్ వైసీపీ

బీజేపీలో గత ఎన్నికల ముందు చేరి హైదరాబాద్ లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలు అయిన మాధవీలత అప్పట్లో కొంత పాపులర్ అయ్యారు.

Update: 2024-09-28 14:14 GMT

బీజేపీలో గత ఎన్నికల ముందు చేరి హైదరాబాద్ లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలు అయిన మాధవీలత అప్పట్లో కొంత పాపులర్ అయ్యారు. ఇక ఎన్నికలు ముగిసాక ఆమె రాజకీయ హడావుడి తగ్గింది అన్న ప్రచారం కూడా ఉంది. అయితే మాధవీలత ఇపుడు ఏపీలో ఎంట్రీ ఇచ్చారు. ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇష్యూ హీటెక్కిన వేళ జగన్ డిక్లరేషన్ ఇచ్చి మరీ తిరుమలకు వెళ్లాలని శుక్రవారం రోజంతా దాని మీదనే డిబేట్ సాగిన వేళ ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి శ్రీవారి భక్తులతో కలసి ఆమె భజనలు చేసుకుంటూ మరీ తిరుపతిలో ల్యాండ్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆమె తొలిసారిగా వైసీపీ మీద జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ మీద కూడా ఆరోపణలు గుప్పించారు. శ్రీవారి ఆలయంలో పవిత్రత్ర తగ్గుతోందని దానికి కారణం నాటి కాంగ్రెస్ అయినా నేటి వైసీపీ అయినా జరిగేది అదే అని అన్నారు. అంతే కాదు శ్రీవారి లడ్డూ ప్రసాదంతో కల్తీ జరుగుతోందని కోట్లాది మంది భక్తులు మనోవేదన చెందుతున్నారని వారి ప్రతినిధిగా తాను వచ్చాను తప్ప రాజకీయ నేతగా కాదు అని ఆమె అన్నారు.

ఇక జగన్ మీద ఆమె ఘాటైన వ్యాఖ్యలే చేశారు. తన అయిదేళ్ల పాలనలో జగన్ 18 సార్లు నెయ్యి కల్తీ అయిందని ట్యాంకర్లు వెనక్కి పంపించేశామని చెబుతున్నారని మరి వాటిలో ఏ ఒక్క దాని మీద అయినా టెస్ట్ చేసినట్లుగా లేబరేటరీ రిపోర్టు ఉందా ఉంటే చూపించాలని సవాల్ చేశారు.

వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఈవోగా ఉండగా అన్యమతస్థులు తిరుమల రావద్దు అని పేర్కొన్న జీవోను రద్దు చేశారని ఆమె విమర్శించారు. హిందువులు గెలిపిస్తే గెలిచిన మీరు హిందువుల మనోభావాలనే దెబ్బ తీస్తారా అని ఆమె ఫైర్ అయ్యారు. ఎవరిది అధిక సంఖ్య అంటూ కూడా ఆమె కామెంట్స్ చేశారు. హిందువులే దేశంలో అధికంగా ఉన్నారని ఆమె గుర్తు చేస్తూ మా మీదనే దాడులా అని నిలదీశారు.

ఆమె జగన్ తండ్రి వైఎస్సార్ ని అలాగే సోనియాగాంధీని కూడా విమర్శించారు. డిక్లరేషన్ ఇవ్వకుండానే వారు తిరుమలకు వచ్చారు అని ఆరోపించారు. జగన్ సహా అన్య మతస్థులను తిరుపతి నుంచే లోపలికి రానీయకుండా చేయాలని కూడా ఆమె హాట్ కామెంట్స్ చేశారు.

శ్రీవారికి ఆకాశరాజు నుంచి ఆఖరి భారతీయ మహరాజు కృష్ణదేవరాయలు ఇచ్చిన కానుకల దాకా భూముల దాకా ఎన్ని ఉన్నాయో అన్నీ లెక్క చెప్పాల్సిందే అని అన్న్నారు. లడ్డూ ప్రసాదంతో మొదలెట్టిన ఈ తీగ మొత్తం డొంకను కదల్చే విధంగా సాగాల్సిందే అని మాధవీ లత అన్నారు. కోట్లాదిమంది హిందువులకు ఈ విషయం చేరేంత వరకూ తాము ఉద్యమిస్తూనే ఉంటామని అన్నారు.

అలాగే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దోచుకున్న డబ్బులు కూడా బయటకు రావాలని లెక్క తేలాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇక మాధవీలత మీద వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అయితే మాధవీలతకు ప్రతి సవాల్ చేశారు. చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తే దాని మీద వైసీపీ పోరాడుతోందని బీజేపీ నేత మాధవీలతకు ఇవేమీ కనిపించవా అని ప్రశ్నించారు. సిట్ విచారణతో బాబు ఎందుకు సరిపెడుతున్నారో వారికి అర్ధం కావడం లేదా అని ఆమె నిలదీశారు.

చంద్రబాబు సీబీఐ విచారణకు వెనకడుగు వేయడం బట్టి చూసినా అబద్ధం చెప్పారని తెలియడం లేదా అని కూడా ప్రశ్నించారు. జగన్ ని తిరుమల రానీయను అంటున్న మీరు ఎవరని ప్రశ్నించారు. నరేంద్రమోడీతో జగన్ తిరుపతికి పలు మార్లు వెళ్లారని గుర్తు చేశారు. అపుడు మీరు ఏమయ్యారని నిలదీశారు.

బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని వారిని ఎందుకు అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు కానీ జగన్ తొలిసారి తిరుమలకు రాలేదని పది సార్లు పైగా తిరుమల వెళ్ళారని ఆమె గుర్తు చేశారు. టీటీడీ నిబంధలను బదులు టీడీపీ నిబంధనలు అమలు చేయడం వల్లనే ఇలా జరుగుతోందని అన్నారు

గత మూడు నెలలుగా ఎంత మంది చేత డిక్లరేషన్ తీసుకున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మొత్తం మీద చూస్తే ఈ ఇష్యూ మరింతగా రాజుకుంటోంది. ఏపీలో మత రాజకీయం దిశగా పరిణామాలు మారుతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. మాధవీలత బీజేపీ ఫైర్ బ్రాండ్. అలాంటి వారు ఎంట్రీ ఇవ్వడంతో ఈ లడ్డూ ఎపిసోడ్ మరో కొత్త మలుపు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీని మీద వామపక్షాలు ఇతర నాయకులు అయితే ఈ ఇష్యూని కేవలం లడ్డూ ప్రసాదం కల్తీ అయిందా లేదా అన్న విచారణకే పరిమితి చేస్తే ఇంత గొడవ సాగేది కాదని ఇకనైనా ఆ దిశగా ఆలోచించాలని అంటున్నారు.

Full View
Tags:    

Similar News