జేసీకి షాక్.. మాధవీలత ఫిర్యాదుపై కేసు
సినీ నటి, బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత ఫిర్యాదుతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది.
సినీ నటి, బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత ఫిర్యాదుతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తనను బెదిరిస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని గత నెల 21న హైదరబాద్ సీసీఎస్ పోలీసులకు మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ అనుచరులు తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు టీడీపీ నేత జేసీపై కేసు నమోదు చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక వేడుకలు నిర్వహించడం, ఈ విషయంలో మాధవీలతతోపాటు బీజేపీ మహిళా నేతలు విమర్శలు చేయడం తెలిసిందే. ఆ సందర్భంగా జేసీ బీజేపీ మహిళా నేతలపై ఎదురుదాడి చేశారు. అప్పట్లో ఈ సంఘటన రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.
తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జేసీ నిర్వహించిన వేడుకులు వివాదాస్పదమయ్యాయి. ఆ సమయంలో జేసీ ట్రావెల్స్ బస్సు కూడా దగ్ధమైంది. అప్పట్లో ఆ సంఘటనపై ఫిర్యాదు తీసుకునేందుకు జేసీ ఇంటికి పోలీసులు వెళ్లగా, ఆయన సుమోటాగా కేసు నమోదు చేసుకోమన్నారు. ఈ సందర్భంలో ఆయన తనను విమర్శించిన బీజేపీ మహిళా నేతలపై విరుచుకుపడ్డారు. జేసీ పరుష వ్యాఖ్యల వీడియో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన మాధవీలత జేసీ వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు. ఇలా జేసీ, మాధవీలత మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా, కొంతమంది ఆమెను బెదిరించినట్లు ఆరోపించారు. సంఘటన జరిగి చాలా రోజులు అవుతున్నా బెదిరింపులు ఆగడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బాధితురాలు ఫిర్యాదు మేరకు జేసీతోపాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.
గత నెలలో సంచలనం రేపిన ఈ వ్యవహారంపై జేసీ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉండటంతో అవి జేసీ అనుచరులవే అని మాధవీలత అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల పెద్దలు రంగంలోకి దిగి రాజీకుదుర్చుతారా? లేక వ్యక్తిగత విషయమని ఆ ఇద్దరూ తేల్చుకోవాలని వదిలేస్తారా? అన్నది చూడాల్సిందే..