ఒవైసీపై పోటీ చేసే మాధవీ లత బ్యాగ్రౌండ్ ఇదే

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈ స్థానంలో మాధవీ లత పోటీ చేయబోతున్నారు.

Update: 2024-03-02 16:46 GMT

త్వరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలోని హైదరాబాద్ లోక్ సభ స్థానానికి గాను విరించి హాస్పిటల్స్ చైర్ పర్సన్ కొంపెల్ల మాధవీ లతను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈ స్థానంలో మాధవీ లత పోటీ చేయబోతున్నారు. ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎలాగైనా విజయం సాధించాలని బిజెపి గట్టి పట్టుదలతో ఉంది.

ఈ క్రమంలోనే హిందుత్వవాదిగా, సనాతన ధర్మ ప్రచారకర్తగా ఉన్న మాధవీలతకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. వాస్తవానికి గత కొద్ది నెలలుగా మాధవీ లత కు టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే ఆమెకు టికెట్ దక్కింది. హిందుత్వంపై, సనాతన ధర్మంపై, భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై మాధవీ లత అనర్గళంగా మాట్లాడగలరు.

స్వతహాగా ప్రొఫెషనల్ భరత నాట్య నృత్యకారిణి అయిన మాధవీలత ఆర్టిస్ట్ కూడా. పాతబస్తీలో గతంలో హెల్త్ క్యాంపులు నిర్వహించడం, పేదలైన ముస్లింలకు సహాయం చేయడం, అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో అక్కడి ప్రజలలో మాధవీ లతకు మంచి ఇమేజ్ ఉంది.

దాంతోపాటు పాతబస్తీలో ఎంఐఎం నేతల కుట్ర రాజకీయాల వల్ల ముస్లింలు ఇంకా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికి తనవంతు కృషి చేయాలని భావిస్తున్నానని మాధవీ లత గతంలో పలుమార్లు చెప్పారు. అయితే, ఒవైసీనే ఎంపీగా పోటీ చేస్తే ఈసారి మాధవి లత గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని బిజెపి నేతలు భావిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు హిందుత్వ అజెండాను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిన మాధవీలతపై బీజేపీ అధిష్టానం నమ్మకం ఉంచింది.

Tags:    

Similar News