అన్నీ విలీనం.. ‘మహా’ హైదరాబాద్.. రేవంత్ సంచలనం!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను.. హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఆవిష్కరించేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ కసరత్తు చేస్తున్నారు.

Update: 2024-03-02 04:54 GMT

ప్రతి అంశంలోనూ తనదైన మార్కును ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్కొక్క అంశాన్ని టచ్ చేస్తూ.. వాటికి అవసరమైన మార్పులు చేర్పులు చేయటమే కాదు.. ఫ్యూచర్ కు తగిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం మీద ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను.. హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఆవిష్కరించేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ కసరత్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరి శివారులో ఉన్న కార్పొరేషన్లు.. మున్సిపాలిటీల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు.. 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు కసరత్తు చేయాలని డిసైడ్ చేసిన సీఎం రేవంత్.. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లను మరింత పెంచే దిశగా అడుగులు వేశారు.

హైదరాబాద్ మహానగరితో పాటు.. దాని పక్కనే ఉన్న శివారు ఇప్పుడు నగరంలో భాగమైంది. కానీ.. గత ప్రభుత్వం కార్పొరేషన్లను.. మున్సిపాలిటీలను ఏర్పాటు చేయటం ద్వారా కొత్త రాజకీయ ఎత్తుగడకు తెర తీసింది. దీని కారణంగా.. రాజకీయ పదవులు పెద్ద ఎత్తున పందేరం చేసేలా డిజైన్ చేసింది. దీని కారణంగా వచ్చే ఇబ్బందేమంటే.. డెవలప్ మెంట్ విషయంలో జీహెచ్ఎంసీతో పోటీ పడే పరిస్థితి లేకపోవటంతో పాటు.. అక్రమ నిర్మాణాలు.. కబ్జాలకు స్థానిక నాయకత్వ జోక్యం ఎక్కువ అవుతున్న పరిస్థితి. అధికారుల్ని నేతలు ఆడేసుకుంటున్న దుస్థితి.

ఇలాంటివేళ.. గ్రేటర్ హైదరాబాద్ ను మరింత విస్తరించి.. మొత్తాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావటం ద్వారా.. డెవలప్ మెంట్ మరింత వేగంగానే.. అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లకు సంబంధించి దాదాపుగా కోటికి పైగా ప్రజలు ఉన్నారు. అదే సమయంలో మహానగరి శివారులో ఉన్న ఏడు కార్పొరేషన్లు.. 30 మున్సిపాలిటీల్లో సుమారు 60 లక్షల వరకు జనాభా ఉంటుందన్న అంచనా. ఈ రెండింటిని విలీనం చేస్తే దాదాపు 1.80 కోట్ల నుంచి 2 కోట్ల వరకు జనాభా చేరుకునే వీలుంది. విలీనం చేసిన ప్రాంతాలన్నింటిని గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు.

పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న వాదనకు స్పందించిన ముఖ్యమంత్రి.. అవసరమైతే.. ఇప్పటి జీహెచ్ఎంసీని ఇట్లానే ఉంచేసి.. తూర్పు.. పశ్చిమ.. ఉత్తర.. దక్షిణం పేరుతో నాలుగు సిటీ కార్పొరేషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేసేలా అధికారుల్నికసరత్తు చేయాలని ఆదేశించారు. ప్రాంతీయ రింగురోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్న నేపథ్యంలో.. తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది.

జీహెచ్ఎంసీకి అనుకొని ఉండే ఏడు కార్పొరేషన్ల పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉంది. వీటితో పాటు 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. వాటి పాలకవర్గాల పదవీకాలం మరో ఏడాది మాత్రమే ఉంది. ఆ తర్వాత ప్రత్యేక అధికారుల్ని నియమించటం ద్వారా.. ముఖ్యమంత్రి తాను అనుకున్న రీతిలో మహా హైదరాబాద్ ను ఆవిష్కరించేందుకు వీలుగా పరిస్థితుల్ని తీసుకొస్తున్నట్లుగా చెప్పాలి. 30 మున్సిపాలిటీలతో పాటు.. బోడుప్పల్.. పీర్జాదిగూడ.. జవహర్ నగర్.. బండ్లగూడ జాగీర్.. నిజాంపేట.. బండగ్ పేట.. మీర్ పేట కార్పొరేషన్లు గ్రేటర్ లో విలీనం అయ్యేలా చర్యలు తీసుకుంటారు.

ఎందుకిలా? అంటే.. నగరం విస్తరిస్తోంది. శివారు భారీగా నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. అందుకు తగ్గట్లుగా డెవలప్ మెంట్ జరగటం లేదు. రహదారుల విస్తరణ..డ్రైనేజీ సిస్టం ఏ మాత్రం సరిగా లేని దుస్థితి. ఈ నేపథ్యంలో ఆ చికాకులకు చెక్ పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ ను మహా నగరంగా మార్చేయటం ద్వారా.. డివజన్ల పునర్విభజన చేస్తారు. దేశ రాజధాని ఢిల్లీని సైతం రెండేళ్ల క్రితం అక్కడున్న మూడు కార్పొరేషన్లను ఒకే కార్పొరేషన్ గా మార్చేశారు. ఇప్పుడు హైదరాబాద్ ను సైతం అదే తీరులో మార్చేయనున్నారు.

Tags:    

Similar News