'లవ్ జీహాద్'పై మహారాష్ట్రలో కీలక పరిణామం!

హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వివాహాం చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

Update: 2025-02-15 16:09 GMT

"లవ్ జీహాద్" అనేది ఎంతటి సంచలన విషయం అనేది తెలిసిందే. 2022లో మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్ ను ఆఫ్తాబ్ పూనావాలా అనే ఆమె ప్రియుడు ముక్కలుగా చేసి అంతమొందించాడు. దీంతో.. అప్పట్లో లవ్ జీహాద్ అంశం తెరపైకి వచ్చింది. హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వివాహాం చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ సమయంలో ఈ వ్యవహారంపై విపరీతమైన చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై సినిమాలు తెరకెక్కిన పరిస్థితి! ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచన చేసింది! ఇందులో భాగంగా... లవ్ జీహాద్ ను అడ్డుకునేందుకు ఓ చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. దీనికోసం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

అవును... లవ్ జీహాద్ ను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తోందని అంటున్నారు. ఈ సమయంలో.. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలను అడ్డుకోవడానికి ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ నేతృత్వం వహించనున్నారు.

ఈ సందర్భంగా... బలవంతపు మత మార్పిడులకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలు, వీటిని అడ్డుకునేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ గుర్తించి, విశ్లేషించి ప్రభుత్వానికి తెలియజేయనుంది. దీంతో... మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది.

అయితే... ఈ కమిటీని విపక్షాలు తప్పుబట్టాయి. ఇందులో భాగంగా... ముస్లింలను వేధించడం, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్ఞీ పేర్కొన్నారు. ఇదే సమయంలో.. లవ్ జీహాద్ అనేది ఓ అపోహ మాత్రమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే హుస్సేన్ దల్వాయి అన్నారు.

ఇదే క్రమంలో... రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ నేత సుప్రియా సూలే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇదే సమయంలో... దేశంలో ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పిస్తోందని గుర్తు చేశారు.

కాగా... గత ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ 'యూపీ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ (సవరణ) బిల్లు - 2024' ను ఆమోదించిన సంగతి తెలిసిందే. బెదిరించి లేదా వివాహ హామీతో ఒక వ్యక్తి మతం మర్చినట్లయితే 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే నిబంధనలతో ఇది ఉంది!

Tags:    

Similar News