'భార‌త ర‌త్న‌' టాటా: మ‌హారాష్ట్ర స‌ర్కారు తీర్మానం

అదేవిధంగా అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైన‌.. మహారాష్ట్ర కేబినెట్‌.. టాటా సేవ‌ల‌కు గుర్తుగా భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని తీర్మానం చేసింది.

Update: 2024-10-10 08:41 GMT

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పారిశ్రామిక దిగ్గ‌జం, బుధ‌వారం రాత్రి క‌న్నుమూసిన ర‌త‌న్ టాటాకు దేశ అత్యున్న‌త పౌర పురస్కారం `భార‌త ర‌త్న‌`ను ఇవ్వాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. అదేవిధంగా అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైన‌.. మహారాష్ట్ర కేబినెట్‌.. టాటా సేవ‌ల‌కు గుర్తుగా భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని తీర్మానం చేసింది. ఈ తీర్మాన కాపీని ఈ రోజే కేంద్ర హోం శాఖ‌కు పంపించున్నా రు. అదేవిధంగా టాటా మృతికి సంతాప సూచ‌కంగా.. గురువారం రాష్ట్రంలో సంతాప‌దినాన్ని ప్ర‌క‌టించా రు.

మ‌రోవైపు.. రాష్ట్ర అధికారిక లాంఛ‌నాల‌తో ర‌త‌న్ టాటాకు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. అవివా హితుడైన ర‌త‌న్ టాటాకు ఆయ‌న సోద‌రుడు నావెల్ టాటా క‌ర్మ‌కాండ‌లు చేయ‌నున్నారు. ముంబైలోని ఎన్‌సీపీఎ మైదాన్‌లో ఉంచిన టాటా పార్థివ దేహాన్ని ద‌ర్శించుకుందుకు నేత‌లు, సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా క్యూ క‌ట్టారు. ఆయ‌న సేవ‌ల‌ను, త‌మ‌తో ఆయ‌న‌కు ఉన్న అనుబంధాన్ని మ‌న‌నం చేసుకున్నారు. క్రికెట‌ర్ల నుంచి వ్యాపారుల వ‌ర‌కు, పారిశ్రామిక దిగ్గ‌జాల నుంచి న‌టుల వ‌ర‌కు ఎంద‌రో టాటా భౌతిక దేహానికి నివాళుల‌ర్పించారు.

రాష్ట్ర‌ప‌తి నుంచి రాహుల్ వ‌ర‌కు..

+ ర‌త‌న్ టాటా మృతి ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ర‌త‌న్ టాటా మ‌ర‌ణ వార్త‌.. త‌న‌ను ఎంతో క‌ల‌చి వేసింద‌ని తెలిపారు. కార్పొరేట్ వృద్ధిని దేశ నిర్మాణంతో, నైతికతతో మిళితం చేసిన మ‌హోన్న‌త వ్య‌క్తిగా ర‌త‌న్ టాటాను అభివ‌ర్ణించారు. ఎంతో కృషితో టాటా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లార‌ని, టాటా వ్యాపారాల‌ను ప్ర‌పంచ దేశాల‌కు సైతం విస్త‌రింప‌జేశార‌ని పేర్కొన్నారు. దాతృత్వానికి ర‌త‌న్ టాటా మారు పేరని తెలిపారు. ఈ విషాద‌క‌ర స‌మ‌యంలో ర‌త‌న్ టాటా కుటుంబ సభ్యులకు, టాటా గ్రూప్ బృందానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు రాష్ట్ర‌ప‌తి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

+ రతన్‌ టాటా మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. రతన్‌ టాటా దూరదృష్టి గ‌ల‌ వ్యాపారవేత్త అని, దయగల అసాధారణ వ్యక్తి అని తెలిపారు. దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారని తెలిపారు. మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని కొనియాడారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యం నుంచి త‌న‌కు ర‌త‌న్ టాటాతో ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌ని న‌రేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో పోస్టు చేశారు.

+ ప్రముఖ పారిశ్రామికవేత్త, నిజమైన జాతీయవాది రతన్ టాటా అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ర‌త‌న్ టాటా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి నిస్వార్థంగా తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. తాను ఆయ‌న‌తో క‌లిసిన‌ ప్రతిసారీ, దేశం, ప్రజల అభ్యున్నతి గురించే ఎక్కువ‌గా ప్ర‌స్తావించేవార‌ని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం పట్ల టాటాకు ఎంతో నిబద్ధత ఉంద‌న్నా రు. రతన్ టాటా భౌతికంగా మ‌న నుంచి దూర‌మైనా ఆయ‌న వ‌దిలి వెళ్లిన నిబ‌ద్ధ‌త‌, అంకిత భావం మ‌న‌కు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయ‌ని పేర్కొన్నారు.

+ పారిశ్రామిక వేత్త ర‌త‌న్ టాటా మృతి త‌న‌ను దిగ్బ్రాంతికి గురి చేసింద‌ని కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కులు, లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత రాహుల్‌గాంధీ తెలిపారు. రతన్ టాటా విజన్ ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. కేవలం వ్యాపార వేత్త‌గానే కాకుండా.. సమాజ సేవ‌లోనూ ఆయ‌న ఎంతో చొర‌వ చూపించార‌ని, త‌న‌దైన శాశ్వతమైన ముద్ర వేశారని తెలిపారు. ర‌త‌న్ టాటా కుటుంబానికి, టాటా గ్రూప్ సంస్థ‌ల ఉద్యోగులు, సిబ్బందికి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News