'మహానోరు' తెచ్చిన తంటా.. టీడీపీకి సెగ!
అయితే.. రాజేష్‌కు ఈ టికెట్ ఇవ్వడం వెనుక చంద్రబాబుకు కనిపించిన ఈక్వేషన్లు ఏంటో తెలియదు కానీ
వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ.. మంచిదే అయినప్పటికీ.. కొన్నికొన్ని విషయాలపై అతిగా స్పందించినా.. అతిగా మాట్లాడినా.. నోరు పారేసుకున్నా.. అంతిమంగా చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయం. ఇప్పుడు ఈ పరిస్థితే.. టీడీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన `మహాసేన` పేరుతో యూట్యూబ్ చానెల్ మొదలు పెట్టి... తనకంటూ కొందరు అభిమానులను సంపాయించుకున్న రాజేష్‌కు భారీ సెగ పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పి.గన్నవరం టికెట్‌ను ఆయనకు కేటాయించిన విషయం తెలిసిందే.
అయితే.. రాజేష్‌కు ఈ టికెట్ ఇవ్వడం వెనుక చంద్రబాబుకు కనిపించిన ఈక్వేషన్లు ఏంటో తెలియదు కానీ.. స్థానికంగా మాత్రం ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక సామాజిక వర్గాన్ని తూల నా డాడని.. అలాంటి వ్యక్తి కుల నాయకుడిగా మాత్రమే పనికి వస్తాడని.. పి.గన్నవరం ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు.. ఇది ఆయన సొంత నియోజకవర్గం కూడా కాదని తేల్చి చెబుతున్నారు. దీంతో పి.గన్నవరం స్థానంలో మార్పు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
వాస్తవానికి రాజేష్ టికెట్ ఆశించలేదు. అసలు ఏ పార్టీలోనూ చేరాలని కూడా అనుకోలేదు. అయితే.. ఆయన వాయిస్ విని.. చంద్రబాబు ఆయనను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే.. ఆయన మాటలే ఇప్పుడు పార్టీకి, ఆయనకు కూడా తూటాల మాదిరిగా మారాయి. ఏదేమైనా.. విమర్శలు చేయొచ్చు. కానీ, హద్దులు మీరి.. అనైతిక సంభాషణలకు దిగితే.. ప్రజలు అందరినీ గమనిస్తున్నారన్న విషయం పి.గన్నవరంలో స్పష్టమైంది.
ఐవీఆర్ ఎస్ సర్వే..
మహాసేన రాజేష్ వ్యాఖ్యలతో ఆయన టికెట్ ను మరొకరికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజేష్ స్థానంలో పి గన్నవరం స్థానంలో మోకా బాలగణపతిని నియమిస్తారని అంటున్నారు. కాట్రేనికోనకి చెందిన మోకా ఆనంద్ సాగర్ కుమారుడు బాలగణపతి. పి. గన్నవరం అభ్యర్థి మార్పు విషయంలో ఫోన్ కాల్స్ ద్వారా టీడీపీ అధిష్ఠానం సర్వే చేస్తున్నట్లు తెలిసింది.