నిన్న ‘ఆర్‘ ట్యాక్స్ .. నేడు ‘యూ’ ట్యాక్స్
తెలంగాణలో రాహుల్ ట్యాక్స్, రేవంత్ ట్యాక్స్ లు వసూలు చేస్తున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో రాహుల్ ట్యాక్స్, రేవంత్ ట్యాక్స్ లు వసూలు చేస్తున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్ ట్యాక్స్ స్థానంలో ‘యూ’ ట్యాక్స్ కూడా చేరిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరుగుతుందని అంటున్నాడు.
‘‘రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రూ. 950 కోట్ల కుంభకోణం జరిగింది. ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో ప్రతి బస్తాకు 2 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని, ఇలా ఒక్కో క్వింటాల్‌కు 10 నుంచి 12 కిలోలు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం ఈ సీజన్‌లో 1.3 కోట్ల టన్నుల ధాన్నాన్ని కొనుగోలు చేస్తున్నది. ఈ లెక్కన 1300 టన్నుల ధాన్యాన్ని అధికంగా తీసుకుంటుంది. ఈ రశీదు లేని ధాన్యం మొత్తం విలువ సుమారు రూ.1600 కోట్లు. ఇలా అధికంగా ధాన్యం ఇచ్చినందుకు మిల్లర్లు ‘యూ’ ట్యాక్స్ పేరుమీద మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, అధికారులకు ఎంత ఇస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇటీవలే రూ. 500 కోట్లు చేతులు మారాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇందులో రూ. 100 కోట్లను ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌కు పార్టీ ఫండ్‌గా ఇచ్చాడు’’ అని మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు.
మిల్లర్ల నుంచి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి మొత్తం రూ.25వేల కోట్ల విలువైన బియ్యం రావాల్సి ఉన్నదని, బియ్యం మిల్లర్ల దగ్గర ఉంటే ప్రభుత్వం ఎందుకు వడ్డీ కడుతుందని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించాడు.మిల్లర్లు రూ.450 కోట్లు పోగుచేసి రశీదు లేని పన్ను కట్టారు. గతంలో చేతులు మారిన రూ.500కోట్లు కూడా కలిపితే ఇది మొత్తం రూ.950 కోట్ల కుంభకోణమని మహేశ్వర్ రెడ్డి అన్నాడు.
సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తే ఇది రుజువు చేస్తానని చెప్పడం విశేషం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న నేపథ్యంలో వచ్చిన తర్వాత దీనికి సమాధానం ఇస్తానని చెబుతున్నాడు.