కరువు పాలమూరు నుంచి సీఎం రేవంత్.. రాత మారుస్తారా?

ఉమ్మడి పాలమూరు జిల్లా అతి పెద్దది. హైదరాబాద్ శివారు కొత్తూర దగ్గర మొదలై.. షాద్ నగర్ మీదుగా అలంపూర్ వరకు 170 కిలోమీటర్ల పైనే జాతీయ రహదారి వెళ్తుంది.

Update: 2023-12-04 11:00 GMT

ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత కరువు జిల్లాలు ఏవంటే.. అనంతపురం, మహబూబ్ నగర్ అని చెప్పేవారు. వర్షపాతం తక్కువ.. సాగు యోగ్యమైన భూమి లేదు.. ప్రాజెక్టులు లేవు.. దశాబ్దాలుగా ప్రజలు వలస బాట.. ఉపాధి అవకాశాలు శూన్యం.. ఇలాంటి అనేక కారణాలతో మహబూబ్ నగర్ అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరుగాంచింది. అటు అనంతపురం కూడా అంతే. ఒకప్పుడు పాలు విరివిగా లభ్యమై.. పాలమూరుగా పేరుగాంచిన మహబూబ్ నగర్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడమే విచిత్రం. అయితే, ఆ జిల్లా నుంచి మహామహులైన నాయకులు వచ్చారు.

నాటి బూర్గుల నుంచి మొన్నటి నాగం వరకు

ఉమ్మడి పాలమూరు జిల్లా అతి పెద్దది. హైదరాబాద్ శివారు కొత్తూర దగ్గర మొదలై.. షాద్ నగర్ మీదుగా అలంపూర్ వరకు 170 కిలోమీటర్ల పైనే జాతీయ రహదారి వెళ్తుంది. ఇటు మహబూబ్ నగర్ నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని అచ్చంపేట వరకు ఉంటుంది. ఇలాంటి జిల్లా నుంచి పెద్ద నాయకులు వచ్చారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేశారు. హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బూర్గుల రామక్రిష్ణారావు, కేంద్ర మంత్రి గా జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పిన సూదిని జైపాల్ రెడ్డి, నాగర్ కర్నూల్ అడ్డాగా పలుసార్లు గెలుపొందిన నాగం జనార్దన్ రెడ్డి, గద్వాల ఆడబిడ్డ డీకే అరుణ ఇలాంటివారు ఎందరో. ఎక్కడో ఖమ్మం జిల్లాలో పుట్టిన మల్లు అనంతరాములు నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా, ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. మరోవైపు టీడీపీ ఆవిర్భావంతో నాగం వంటి నాయకులు వెలుగులోకి వచ్చారు

బూర్గుల తర్వాత రేవంత్ సీఎం

నాయకత్వపరంగా ఘన చరిత్ర ఉన్న ఉమ్మడి పాలమూరు కరువుకు మారుపేరుగా నిలవడం ఊహించనిదే. ఇక రాజకీయాలకు వస్తే బూర్గుల రామక్రిష్ణారావు తర్వాత ఆ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఘనతను దక్కించుకోనున్నారు. కల్వకుర్తి సమీపంలోని పడకల్ గ్రామంలో జన్మించిన రామక్రిష్ణారావు స్వగ్రామం బూర్గుల. ఊరి పేరే ఇంటిపేరైంది. కాగా, హైదరాబాద్, పుణె, ముంబైల్లో చదివిన ఆయన.. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దగ్గర జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. నిజాం పాలన ముగిశాక 1952లో ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ఎన్నికలు జరిగాయి. మహబూబ్‌ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి బూర్గుల శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత సీఎం అయ్యారు. కాగా, ఆ తర్వాత ఉమ్మడి పాలమూరు నాయకులు ఎవరికీ ఉమ్మడి ఏపీలో సీఎం అయ్యే అవకాశం రాలేదని చెబుతారు.

జైపాల్ రెడ్డి వద్దన్నారా?

సూదిని జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా యూపీఏ ప్రభుత్వంతో చక్రంతిప్పారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉంది. జైపాల్ రెడ్డిని సీఎంగా వెళ్లమని కోరితే ఆయన తిరస్కరించినట్లు సమాచారం. జైపాల్ ఒప్పుకొని ఉంటే.. ఆయనే ఉమ్మడి ఏపీ సీఎం అయ్యేవారని చెప్పేవారు. కాగా.. నాడు వద్దనుకున్న అవకాశం, అదే కాంగ్రెస్ తరఫున.. అదే పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డికి దక్కింది. ఈ రోజు రాత్రి ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ డెవలప్ మెంట్ కు పాటుపడతానని స్పష్టం చేశారు. అత్యంత వెనుకబడిన ఆ నియోజకవర్గం రూపు రేఖలు మారేందుకు అవకాశం ఉందన్నమాట. మరోవైపు పాలమూరు ఇప్పటికే చాలా మెరుగుపడింది. ప్రాజెక్టులన్నీ పూర్తిచేయడం ద్వారా ఆ జిల్లాను మరింత డెవలప్ చేసే అవకాశం రేవంత్ కు దక్కనుంది.

Tags:    

Similar News