'మేకిన్ ఇండియా' విఫలమా? సఫలమా?
`మేకిన్ ఇండియా`-2014-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వినిపించిన నినాదం ఇదే.
`మేకిన్ ఇండియా`-2014-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వినిపించిన నినాదం ఇదే. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్రాల్లోని బీజేపీ నాయకుల వరకు కూడా .. మేకిన్ ఇండియాకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. దీనికి కారణం.. కొత్తగా అప్పట్లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ.. స్వదేశీ వస్తువుల వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మేకిన్ ఇండియా కార్యక్రమం ఉవ్వెత్తున సాగింది. అప్పట్లో మేకిన్ ఇండియా పేరుతో కొత్త రుణాలు కూడా ఇచ్చారు.
అయితే.. ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను కొంత లోతుగా పరిశీలిస్తే.. `మేకిన్ ఇండియా` విఫలమైనట్టే కనిపిస్తోంది. కానీ, 2014-19 మధ్య కాలంలో ప్రవేశ పెట్టిన ఐదు బడ్జెట్‌లలో మేకిన్ ఇండియాకు పెద్ద ఎత్తున పన్నుల రాయితీ ప్రకటించారు. ప్రోత్సాహకాలు ఇచ్చారు. ప్రధాని ఎక్కడికి వెళ్లినా.. మేకిన్ ఇండియా గురించే చెప్పేవారు. కానీ.. దీని ద్వారా.. ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను భరించలేని పరిస్థితి వచ్చినట్టుగా కనిపిస్తోంది.
నిజానికి చైనా.. భారతీయ బొమ్మల రంగాన్నే కాకుండా.. పటాకుల రంగాన్ని కూడా ఆక్రమించేసింది. ఇప్పుడు సెల్ ఫోన్లు, దుస్తుల రంగాన్ని కూడా ఆక్రమించింది. దీనికి ఆటకట్టించే ఉద్దేశంతోనే మేకిన్ ఇండియా జపం చేసిన.. మోడీ.. ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మాత్రం విదేశాలకు పెద్ద పీట వేశారు. ఎంతగా అంటే.. రెడ్ కార్పెట్ పరిచేంతగా.!
+ ఈ-కామర్స్ సంస్థలకు టీడీఎస్ తగ్గించారు. తద్వారా.. విదేశీ వస్తు విపణిని ఇంట్లోకే తెచ్చేసినట్టు అయింది.
+ ఆన్‌లైన్ షాపింగ్‌లో తగ్గనున్న ధరలు: ద్వారా.. స్థానిక ఉత్పత్తుల మార్కెట్‌లు నేల మట్టం ఖాయం. ఇప్పటికే మేకిన్ ఇండియా దెబ్బకొట్టిందనే వాదన ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరింతగా దేశీయ వస్తు తయారీ రంగం నిలువునా మునిగిపోతుంది.
+ క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ: ఇది.. విదేశీ వ్యాపార వేత్తలకు కొంగు బంగారం. తద్వారా.. దేశీయంలో మరింత పోటీ ఏర్పడడం ఖాయం.
+ వజ్రాల వ్యాపారాల్లోకి విదేశీయులు: దేశంలో ఎక్కడైనా విక్రయించుకునే.. ప్రాసెస్ చేసుకునేందుకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించారు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన దేశీయ మార్కెట్ ఒడిదుడుకులకు గురి కానుంది. ఎలా చూసుకున్నా.. మేకిన్ ఇండియా విఫలమైందనేది సుస్పష్టం.