70 ఏళ్ల వయసు.. అయితేనేం మెడిసిన్ పూర్తి చేశాడు
ఆ కోవలోకే వస్తారు మలేషియాకు చెందిన 70 ఏళ్ల తోహ్ హాంగ్ కెంగ్. ప్రపంచంలోనే ఎవరూ చేయని విధంగా.. తొలిసారి ఆయన చేసిన పనేమిటో తెలుసా?
వయసు అనేది ఒక నెంబరు మాత్రమే. అంతకు మించి మరింకేమీ కాదన్న సత్యాన్ని కొందరు మాత్రమే ఒప్పుకుంటారు. అలాంటి వారు తమ జీవితంలో చేయని పనుల్ని.. ఎవరూ ఊహించని విధంగా ముదిమి వయసులో చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు మలేషియాకు చెందిన 70 ఏళ్ల తోహ్ హాంగ్ కెంగ్. ప్రపంచంలోనే ఎవరూ చేయని విధంగా.. తొలిసారి ఆయన చేసిన పనేమిటో తెలుసా? ఈ వయసులో మెడిసిన్ పూర్తి చేయటం.
ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసులో మెడిసిన్ చేసిన పెద్ద మనిషిగా తోహ్ రికార్డు క్రియేట్ చేశారు. తోహ్ తొలిసారి మెడిసిన్ క్లాస్ లో అడుగు పెట్టినప్పుడు.. ఆయన్ను చూసిన అక్కడి విద్యార్థులు ఆయన్ను ప్రొఫెసర్ అనుకున్నారు. కానీ.. ఆయన మెడిసిన్ అభ్యసించేందుకు వచ్చిన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఫిలిప్సీన్స్ లోని సెబులో ఉన్న సౌత్ వెస్ట్రన్ వర్సిటీలో ఆయన మెడిసిన్ పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన్ను సర్ తోహ్ అంటూ గౌరవంగా పిలుస్తున్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. చిన్నతనం నుంచి ఆయన మెడిసిన్ చేయాలన్న ఆలోచన కానీ ఆసక్తి కానీ లేదు. డాక్టర్ కావాలన్న కల కూడా లేదు. ఆర్థిక శాస్త్రం.. కెమికల్.. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత ఆయన మనసు మెడిసిన్ మీదకు మళ్లింది. 2018లో కిర్గిజిస్తాన్ టూర్ కు వెళ్లినప్పుడు ఆయనకు ఇద్దరు యువ భారతీయ వైద్య విద్యార్థులు కలిశారు.
వారి పరిచయంతో ఆయన వైద్య విద్య మీద ఆసక్తి మరింత పెంచింది. 2019లో కార్పొరేట్ ప్రపంచం నుంచి రిటైర్ అయ్యాక మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు రెఢీ అయ్యారు. అన్నిచోట్లా వైద్య విద్యను అభ్యసించేందుకు వయసు అడ్డంకిగా ఉందన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన.. తన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉన్నది ఎక్కడా అని తీవ్రంగా వెతికారు. ఈ క్రమంలో తన పనిమనిషి కుమార్తె ఫిలిప్పీన్స్ లోని మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదవటానికి వయో పరిమితి లేదన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆమె కూడా అక్కడే మెడిసిన్ చదివింది.
అంతే.. అక్కడ సీటు కోసం కష్టపడిన ఆయన.. అందుకు తగ్గట్లే సీటు సాధించాడు. దీంతో.. ఆయన మలేషియా నుంచి షిప్టు అయ్యారు. 2020లో కరోనా విజ్రంభించటంతో హాంకాంగ్ కు షిప్టుఅయ్యారు. అక్కడి నుంచి ఆన్ లైన్ లో క్లాసులు విన్నారు. కుటుంబ సభ్యులు.. తోటి స్టూడెంట్స్ సాయంతో మెడిసిన్ పట్టా అందుకున్న ఆయన.. రెసిడెన్సీ అనుభవంతో పూర్తిస్థాయి లైసెన్స్ డ్ డాక్టర్ కావటానికి మరో పదేళ్లు పడుతుందని చెబుతున్నారు.
మెడికల్ బోర్డు ఎగ్జామ్ కోసం ఏడాది పాటు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంది. అందుకు మరింత అధ్యయనం అవసరం. దీనికి బదులుగా హాంకాంగ్ లోని తన స్నేహితుడి సంస్థలో అలెర్జీ అండ్ ఇమ్యునాలజీ డయాగ్నస్టిక్స్ లో కన్సల్టెంట్ గా పని చేయాలని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. తనలా మెడిసిన్ చేయాలని ఆసక్తి చూపే పేద పిల్లలకు సాయం చేయాలని డిసైడ్ అయిన ఆయన.. స్కాలర్ షిప్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. ఏమైనా.. 70 ఏళ్ల వయసులో మెడిసిన్ పూర్తి చేయటం.. దానికి ఆయనకున్న పట్టుదల.. ప్రయత్నాన్ని మాత్రం మర్చిపోలేం.