అందరికీ మల్కాజ్ ''గురి''.. మినీ ఇండియా మరి..!

ఇప్పటికే బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

Update: 2023-12-19 11:51 GMT

ఈటల రాజేందర్, మైనంపల్లి హనుమంతరావు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరకు.... తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి వరకు.. వీరందరి విషయంలో కామన్ వినిపించే పాయింట్ ఒకటుంది. అదే.. మల్కాజ్ గిరి. దేశంలో పెద్ద లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన ఈ స్థానంలో ప్రధాని మోదీ పోటీకి దిగుతారంటూ కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. మరోవైపు ఇక్కడినుంచి మొన్నటివరకు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన మైనంపల్లి హనుమంతరావు.. వచ్చేసారి కాంగ్రెస్ తరఫున ఎంపీ ఎన్నికల బరిలో దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మినీ ఇండియా..కేంద్ర మంత్రిని అందించింది.

మల్కాజ్ గిరి 2009 లో పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడింది. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు మాత్రమే ఉండేవి. అయితే, పునర్విభజన అనంతరం ఏర్పాటైన మల్కాజ్ గిరి తొలి ఎన్నికల్లోనే ప్రత్యేకత చాటుకుంది. జనరల్ స్థానం అయినప్పటికీ ఇక్కడినుంచి కాంగ్రెస్ తరఫున దళిత నాయకుడు సర్వే సత్యనారాయణను బరిలో దింపడమే దీనికి కారణం. ఆయన తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అనంతరం 2014లో టీడీపీ తరఫున చామకూర మల్లారెడ్డి ఎంపీగా గెలిచారు. ఆ పార్టీని బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫునే నెగ్గారు.

రేవంత్ రెడ్డిని ఆదరించింది..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ స్థానంలో ఓటమి అనంతరం రాజకీయ అనిశ్చిత పరిస్థతుల్లో ఉన్న రేవంత్ రెడ్డిని మల్కాజ్ గిరి నియోజకవర్గం ఆదరించింది. ఆ ఎన్నికల్లో రేవంత్.. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొంది పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ వెళ్లడం ఆయన రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పింది. అంటే.. ప్రతి పార్లమెంటు ఎన్నికకు ఒక కొత్త నాయకుడిని అందించింది మల్కాజ్ గిరి.

దేశంలోనే పెద్దది.. ఈసారి దారెటో..?

మల్కాజ్ గిరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం. 2019 నాటికే ఇక్కడ దాదాపు 32 లక్షల మంది ఓటర్లున్నారు. ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరిగి ఉంటుందనడంలో సందేహం లేదు. అందులోనూ ఇక్కడ 3 లక్షల మంది వరకు ఇతర రాష్ట్రాల వారు ఓటర్లుగా ఉండడం గమనార్హం. అందుకే మినీ ఇండియాగా పేరుగాంచింది. మల్కాజ్ గిరి నుంచి ఈసారి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తకిరంగా మారింది.

మోదీ, మైనంపల్లి, ఈటల..?

మల్కాజ్ గిరి నుంచి ఈసారి ప్రధాని మోదీ చేస్తారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతో రూఢీ కావాల్సి ఉంది. ఒకవేళ ఆయన పోటీకి దిగితే అది సంచలనమే. మరోవైపు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కార్యకర్తలు, ప్రజల్లో మంచి పేరుంది. అలాంటి నాయకుడిని కాంగ్రెస్ బరిలో దింపితే గెలుపు ఖాయం అవుతుందనేది అంచనా. బీజేపీ నుంచి మోదీ కాకుంటే తాను దిగుతానని అంటున్నారు ఈటల రాజేందర్. మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయిన ఈటల, మైనంపల్లికి దీటుగా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది? తేలాల్సి ఉంది.

Tags:    

Similar News