అధ్యక్షా...దండం పెడతా...చెప్పేది విను...!
ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అధ్యక్షా జరా చెప్పేది విను దండం పెడతా అంటూ మొదలెట్టారు.
తెలంగాణా అసెంబ్లీలో ఆయన స్పీచ్ చాలా తమషాగా సాగింది. అయితే అందులో విషయం మాత్రం సీరియస్ గానే ఉంది. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అధ్యక్షా జరా చెప్పేది విను దండం పెడతా అంటూ మొదలెట్టారు. ఆయన చెప్పేది హైడ్రా గురించి. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఎందుకు తీసుకుని వచ్చిందో తెలియదు కానీ పెద్దల్లో గుండెల్లో గరీబోళ్ల లో గుబులు రేగుతోంది అంటూ సెటైరికల్ గానే రేవంత్ సర్కార్ మీద విమర్శల దాడి చేశారు.
హైదరాబాద్ ఐటీ సెక్టార్ లో టాప్ లో ఉందని ఏకంగా తొమ్మిది లక్షల మంది ఇక్కడ జాబ్స్ చేస్తున్నారని, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థలు వచ్చాయని అన్నారు. ఐటీ ఫీల్డ్ లో కర్ణాటకలోని బెంగళూరుని కూడా మించామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజున ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది అని అన్నారు. హైడ్రాను తీసుకుని రావడంతో పెద్ద పెద్దోళ్లకు గుబులు పట్టిపోయింది అధ్యక్షా అని మల్లారెడ్డి చెప్పాల్సింది చెప్పేశారు. ఇక గరీబోళ్లకు గుండెలే పగిలిపోయాయి అధ్యక్షా అని మల్లారెడ్డి అన్నారు.
ఈ హైడ్రాను ఎందుకు తెచ్చిండ్రో ఏమో అర్ధం కాలే అధ్యక్షా అంటూ మల్లారెడ్డి కౌంటర్లు వేశారు. హైడ్రా వచ్చినాక భయాందోళనలు పెరిగిపోయాయని అన్నారు. ఏకంగా హైదరాబాద్ సిటీ మొత్తం కుప్ప కూలిపోయిందని మల్లారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. అభివృద్ధి ఆగిపోయిందని ఏమైనా అనుకోండని మల్లారెడ్డి అన్నారు.
తనకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉదని, విద్యా సంస్థలు ఉన్నాయని తనకేమీ హైడ్రా వల్ల నష్టం వ్యక్తిగతంగా లేదని అన్నారు. తన భూములు బఫర్ జోన్ లో లేవని కూడా స్పష్టం చేశారు. కానీ తాను జనరల్ గా చెబుతుంది ఏంటంటే హైడ్రా వచ్చాక అభివృద్ధికి ఇబ్బంది అయిందని అన్నారు. అమెజాన్, ఫేస్ బుక్ లాంటి కంపెనీలను అమెరికా తరువాత హైదరాబాద్ తీసుకుని రావడం జరిగిందని అన్నారు. హెడ్ క్వార్టర్లు కూడా ఇక్కడే ఉన్నాయని అన్నారు.
హైడ్రా వల్లనే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయింది అని మల్లారెడ్డి కుండబద్ధలు కొట్టారు. మధ్యలో మంత్రి శ్రీధర్ బాబు ఏదైనా మాట్లాడబోతే విను శ్రీధరన్నా అంటూ చెప్పాల్సిన మొత్తం చెప్పేసి సభలో తనదైన సెటైరికల్ స్పీచ్ తో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక లెవెల్ లో విరుచుకుపడ్డారనే చెప్పాలి. బీఆర్ ఎస్ కి చెందిన ఎమ్మెల్యేగా కొత్త గెటప్ లో మల్లారెడ్డి ఈ తరహా హాట్ స్పీచ్ ఇవ్వడం చూసిన వారు మల్లారెడ్డి మెత్త మెత్తగా మాట్లాడుతూనే గుచ్చేశారు కదా అని అంటున్నారు. మరి మల్లారెడ్డి స్పీచ్ ప్రభావం సర్కార్ మీద ఏమైనా ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది.