మరోసారి మ‌ల్‌ రెడ్డి వ‌ర్సెస్ మంచి రెడ్డి... ఐదోసారి ఏమి జరగబోతుంది?

అవును... ఐదోసారి మల్ రెడ్డి వర్సెస్ మంచి రెడ్డి వార్ తె లంగాణ ఎన్నికల్లో జరుగుతుంది. 2004లో మలక్‌ పేట్‌ నియోజకవర్గం నుంచి వారి మధ్య పోటీ మొదలైంది.

Update: 2023-11-28 11:30 GMT

మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, మల్‌ రెడ్డి సోదరులు 20 ఏళ్లుగా రాజకీయంగా పోటీ పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. 2004 లో మలక్ పేట్ లో మొదలైన ఈ ఎలక్షన్ వార్... తాజా ఎన్నికలతో ఐదోసారి జరగబోతుంది. ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ... పోటీ మాత్రం వీరి మధ్యే ఉంటోంది. వీరిలో ఒక్కసారి మల్‌ రెడ్డి గెలవగా మూడుసార్లు మంచిరెడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలో మరోసారి రంగంలోకి దిగుతున్నారు.

అవును... ఐదోసారి మల్ రెడ్డి వర్సెస్ మంచి రెడ్డి వార్ తె లంగాణ ఎన్నికల్లో జరుగుతుంది. 2004లో మలక్‌ పేట్‌ నియోజకవర్గం నుంచి వారి మధ్య పోటీ మొదలైంది. ఇప్పటికే వేరు వేరు పార్టీల నుంచి నాలుగు సార్లు పోటీ పడిన వారు తాజాగా మరోసారి ఇబ్రహీంపట్నం బరిలో నిలిచారు. సుమారు 20 ఏళ్లుగా వీరి మధ్య జరుగుతున్న ఎలక్షన్ వార్ ఎలా సాగిందనేది ఇప్పుడు చూద్దాం.

మొట్టమొదటిసారిగా 2004లో మలక్‌ పేట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్‌ రెడ్డి రంగారెడ్డి.. టీడీపీ తరఫున మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మల్‌ రెడ్డి రంగారెడ్డి గెలుపొందారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనతో వీరి పోటీ ఇబ్రహీంపట్నానికి మారింది. ఈ క్రమంలో 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ తరఫున మల్‌ రెడ్డి రంగారెడ్డి బరిలోకి దిగారు!

ఈ ఎన్నికల్లో మల్‌ రెడ్డిపై మంచిరెడ్డి పైచేయి సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగారెడ్డికి మహేశ్వరం టికెట్‌ కేటాయించింది. దీంతో ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి సోదరుడు మల్‌ రెడ్డి రాంరెడ్డి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే... ఈ ఎన్నికల్లోనూ మరోసారి మంచిరెడ్డిదే పైచేయి అయింది. మల్ రెడ్డి రాంరెడ్డి రెండో స్థానంలో నిలిచారు.

ఇక 2018లో వచ్చిన ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి టీఆరెస్స్ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. దీంతో మల్‌ రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మిత్రపక్షమైన టీడీపీని కాదని బీఎస్పీకి మద్దతిచ్చారు కాంగ్రెస్‌ శ్రేణులు! ఈ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన మల్‌ రెడ్డి రంగారెడ్డి సుమారు 376 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఈ క్రమంలో తాజాగా మంచిరెడ్డి, మల్‌ రెడ్డి మధ్య ఐదోసారి పోటీ జరుగుతోంది. ఇద్దరూ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా... బీఆరెస్స్ నుంచి మంచిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మల్‌ రెడ్డి రంగారెడ్డి తలపడుతున్నారు. మరి ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి!

Tags:    

Similar News