మమత నిర్వేదం... రాజీనామా రాగం

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సైతం బీజేపీని వెనక్కి నెట్టి ఎక్కువ ఎంపీ సీట్లను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది.

Update: 2024-09-14 02:45 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోట తొలిసారి రాజీనామా మాట వచ్చింది. ఆమె 2011 నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికి 13 ఏళ్లుగా ఆమె ఆ పదవిలో ఉన్నారు. హ్యాట్రిక్ లేడీ సీఎం గా కూడా రికార్డు క్రియేట్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సైతం బీజేపీని వెనక్కి నెట్టి ఎక్కువ ఎంపీ సీట్లను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది.

అటువంటి మమతా బెనర్జీకి జూనియర్ డాక్టర్ల నిరసనలు సెగ రేపేలా ఉన్నాయి. కోల్‌కతాలో ఆర్‌జి కర్‌ మెడికల్‌ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినీ హత్యాచారానికి గురైన దారుణ ఘటనను నిరసిస్తూ జూనియర్‌ డాక్టర్లు అక్కడ చాలా కాలంగా నిరసనలు చేస్తున్నారు. ఈ ఘటన ఆగస్ట్ 9 న జరిగింది. నాటి నుంచి నేటి వరకూ మమత ప్రభుత్వాన్ని ఈ ఆందోళలను గుక్క తిప్పుకోనీయడం లేదు.

జూనియర్ డాక్టర్లు తాము చేస్తున్న ఆందోళన విరమించాలని చర్చలకు రావాలని మమతా బెనర్జీ సీఎం హోదాలో ఇచ్చిన పిలుపును సైతం వారు పట్టించుకోవడం లేదు. వరసగా మూడో రోజు కూడా ముఖ్యమంత్రి చర్చలకు సిద్ధంగా ఉన్నా అవతల వైపు నుంచి వైద్యు సంఘాల నుంచి ప్రతినిధులు ఎవరూ హాజరు కాకుండా షాక్ ఇచ్చారు.

దాంతో వైద్యులతో చర్చలు జరపడంలో మమత ప్రభుత్వం విఫలం చెందింది అని అంటున్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో చీకటి అంతా ఉందని జూనియర్ డాక్టర్లు పేర్కొనడం విశేషం. ఈ మేరకు వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖ కాపీని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జెపి నడ్డాకు కూడా పంపారు.

తమ సహచర జూనియర్ డాక్టర్ ని దారుణంగా హతమార్చారని, ఆ ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరగాలని ఆమెకు న్యాయం జరగాలనివారు ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పుడే పశ్చిమబెంగాల్‌ లో డాక్టర్లు ఎలాంటి భయం లేకుండా తమ విధులు నిర్వహించగలుగుతారని వారు పేర్కొనడం విశేషం. తాము ఒక వైపు నిరసనలు తెలియచేస్తూంటే తమను బెదిరింపులు కూడా గురి చేస్తున్నారు అని వారు ఆరోపించారు. అంతే కాదు ఎక్కడ చూసినా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు అన్నారు

పశ్చిమ బెంగాల్ లో ఇపుడు ఎటు చూసినా తమ చుట్టూ చీకటి అలుముకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణమైన పరిస్థితులు మారి వెలుగు రేఖలు వెల్లి విరియాలి అంటే మీ జోక్యం అవసరం అని కేంద్ర పెద్దలకు రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

అంతే కాదు కోల్‌కతాలో జరిగిన హత్యాచార సంఘటన గురించి వారు చెబుతూ మహిళలపై నేరాల పరంపరంలో ఓ భాగంగా అభివర్ణించారు. గడచిన పుష్కర కాలంలో దేశంలో నిర్భయ వంటి లెక్కలేనన్ని అత్యాచారాలు జరిగాయని గుర్తు చేశారు. అయితే వాటిని అన్నింటినీ మరచిపోవడమే సమాజానికి ఉన్న చెడ్డ గుణం అని జూనియర్ డాక్టర్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

మరో వైపు చూస్తే పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర్ల ఆందోళనను విరమింపచేయాలన్న మమత ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి చర్చలకు పిలిచినా చర్చలకు వారు రావడం లేదు. దాంతో విసిగిన మమత ఇక తాను రాజీనామా చేయడమే మిగిలింది అని నిర్వేదాన్ని ప్రదర్శిస్తున్నారు. మరో వైపు మమత పాలనలో చీకటి కేంద్రం జోక్యం చేసుకోవాలని జూనియర్ డాక్టర్లు కోరిన నేపధ్యంలో ఏమి జరుగుతుంది అన్న చర్చ కూడా మొదలైంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News