లీవ్ ఇవ్వని మేనేజర్.. చివరికి ఉద్యోగి ప్రాణాల మీదకు..

అనారోగ్యానికి గురయ్యానని.. ఒకరోజు సెలవు ఇవ్వాలని కోరినందుకు ఆ మేనేజర్ కర్కశంగా ప్రవర్తించాడు.

Update: 2024-09-27 23:30 GMT

అనారోగ్యానికి గురయ్యానని.. ఒకరోజు సెలవు ఇవ్వాలని కోరినందుకు ఆ మేనేజర్ కర్కశంగా ప్రవర్తించాడు. చివరకు ఆయన నిర్ణయం కాస్త ఆ ఉద్యోగి ప్రాణాల మీదకు తెచ్చింది. థాయ్‌లాండ్‌లోని సుఖోథాయ్‌లో జరిగిన ఈ ఘటన ఆ కంపెనీలో తీవ్ర విషాదం నింపింది.

సుఖోథాయ్‌లోని డెల్టా ఎలక్ర్టానిక్స్ ప్లాంట్‌లో 30 ఏళ్ల యువతి ఉద్యోగి చేస్తోంది. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈ నెలలోనే 5 నుంచి 9 వరకు అనారోగ్య సెలవులు తీసుకున్నారు. అనంతరం డ్యూటీకి వచ్చింది. కానీ ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదు. దాంతో మళ్లీ ఆమె సెలవు పెట్టింది. తిరిగి 12న విధుల్లో చేరింది. అప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి అలానే ఉండిపోయింది.

దాంతో అనారోగ్యంతో ఉన్నానని సెలవు కోసం మేనేజర్ వద్దకు వెళ్లింది. కానీ.. ఆ మేనేజర్ మాత్రం లీవ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. సెలవు కావాలంటే డాక్టర్ సర్టిఫికేట్ కావాలని ఆదేశించాడు. అటు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురాలేక.. ఇటు ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె అలాగే విధులు నిర్వర్తించింది. ఆ మరుసటి రోజు డ్యూటీకి వచ్చిన 20 నిమిషాలకే ఆమె కుప్పకూలింది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో ఉద్యోగుల సంక్షేమంపై ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఘటన జరగడంతో మరింత రెట్టింపయింది.

కాగా.. యువతి మృతిపై డెల్టా కంపెనీ స్పందించింది. ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. తమ సంస్థ సభ్యులలో ఒకరిని కోల్పోయామని, ఈ క్లిష్ట సమయంలో కంపెనీ ఆమె కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు సంతాపం తెలుపుతున్నట్లు అందులో పేర్కొంది. అటు డెల్టా సీఈఓ విక్టర్ చెంగ్ సైతం ఈ ఘటనపై స్పందించారు. డెల్టా ఎలక్ట్రానిక్స్ ఓ ఉద్యోగిని కోల్పోయిందని, ఇది అత్యంత బాధాకరమని చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ జరిపించి.. ఆ తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. వారి కుటుంబానికి తమ సంస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News