మైనంపల్లి.. హతవిధీ
కానీ మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డికే అవకాశం దక్కుతుందని సమాచారం అందడంతో మైనంపల్లి రెచ్చిపోయారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యేగా హోదా.. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు మరోసారి టికెట్.. అన్నీ కుదిరితే మరోసారి ఎమ్మెల్యేగా విజయం.. హ్యపీ లైఫ్.. కానీ మైనంపల్లి హన్మంతరావు చేజేతులారా రాజకీయ భవిష్యత్ను ఆగం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన తనయుడు రోహిత్ రాజకీయ భవిష్యత్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆయన.. ఇప్పుడు తన పదవిని పోగొట్టుకునేలాగే కనిపిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి హన్మంతరావు, మెదక్ నుంచి రోహిత్ పోటీ చేయాలనుకుంటున్నారు. తండ్రీ కొడుకులకు బీఆర్ఎస్ టికెట్లు ఇస్తుందని ఆశ పడ్డారు. కానీ మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డికే అవకాశం దక్కుతుందని సమాచారం అందడంతో మైనంపల్లి రెచ్చిపోయారు. అందుకు కారణం మంత్రి హరీష్ రావేనని భావించి నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు.
హరీష్ రావుకు మెదక్లో ఏం పని అని, ఆయన బట్టలు ఊడదీస్తా అని, సిద్దిపేట్లో అడ్రస్ గల్లంతు చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.లక్షల కోట్ల అవినీతి హరీష్ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో తాను, కొడుకు ఇద్దరం పోటీ చేస్తామని, బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్రంగా బరిలో దిగుతామని చెప్పారు.
అయినప్పటికీ మైనంపల్లికి కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. కానీ కొడుకు రాజకీయ భవిష్యత్ తనకు ముఖ్యమని మరోసారి స్పష్టం చేసిన మైనంపల్లి త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. మరోవైపు హరీష్కు మద్దతుగా కేటీఆర్, కవిత ముందుకు రావడం, పార్టీ అంత ఆయన వెంటే ఉండడంతో మైనంపల్లిని బయటకు పంపించాలనే డిమాండ్లు పెరిగాయని తెలిసింది.
దీంతో మైనంపల్లిని సస్పెండ్ చేసేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. మైనంపల్లి తానంతట తాను వెళ్లిపోతే సరేనని, లేదంటే పంపించేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తే అప్పుడు తండ్రీ కొడుకులకు టికెట్ దక్కుతుందా? అన్నది అనుమానమే. బీజీపీలోనూ అంతే. ఒకవేళ వేరే పార్టీపైన లేదా స్వతంత్రంగా పోటీ చేసినా బీఆర్ఎస్ చేతిలో ఓటమి తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.