పాపం కీలక నేత.. కొంపముంచిన బీఫామ్‌!

నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన మందా జగన్నాథం పరిస్థితి ఈసారి ఏమీ బాలేదు.

Update: 2024-04-27 06:39 GMT

నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన మందా జగన్నాథం పరిస్థితి ఈసారి ఏమీ బాలేదు. నాగర్‌ కర్నూలు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆయన వేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురయింది.

మందా జగన్నాథం 1996, 1999, 2004, 2009ల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నాగర్‌ కర్నూలు నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఈసారి మందా జగన్నాథంకు సీటు దక్కలేదు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇటీవల బీఆర్‌ఎస్‌ లో చేరిన మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ కు కేసీఆర్‌ నాగర్‌ కర్నూలు సీటును ఇచ్చారు.

దీంతో మాజీ ఎంపీ మందా జగన్నాథం బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరఫున నామినేషన్‌ కూడా వేశారు. అయితే ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురయింది. దీంతో నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన మందా జగన్నాథం పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.

బీఎస్పీ నుంచి బీఫామ్‌ యూసుఫ్‌ అనే వ్యక్తికి ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఇచ్చారు. మందా జగన్నాథం పది రోజుల క్రితమే బీఎస్పీలో చేరారు. అయితే అప్పటికే నాగర్‌ కర్నూలు బీఫామ్‌ ను మాయావతి యూసుఫ్‌ కు ఇచ్చారు. దీంతో అదే పార్టీ తరఫున మందా వేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఇండిపెండెంట్‌ గా పోటీ చేద్దామనుకున్నా అది కూడా నెరవేరలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుండాలంటే కనీసం 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. కానీ ఆయన నామినేషన్‌ ను ఐదుగురు మాత్రమే ప్రతిపాదించారు. దీంతో ఆయన పోటీ నుంచి పూర్తిగా ఔటైపోయారు.

వాస్తవానికి మందా జగన్నాథం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అలంపూర్‌ అసెంబ్లీ టికెట్‌ తన కొడుకు శ్రీనాథ్‌ కు ఇవ్వకపోవడంతో ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే తనకు నాగర్‌ కర్నూల్‌ ఎంపీ సీటును ఇవ్వకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌ ను వదిలేసి బీఎస్పీలో చేరారు.

ఈ క్రమంలో నాగర్‌ కర్నూల్‌ సీటును మందా జగన్నాథంకే ఇస్తున్నట్టు మాయావతి ప్రకటించారు. అయితే మాయావతి నుంచి బీఫామ్‌ అందకపోవడంతో ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురయింది.

Tags:    

Similar News