కర్ణాటకలో జులాయి సినిమా సీన్.. పట్టపగలు రూ.15 కోట్ల బంగారం దోపిడీ
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళూరు పర్యటనలో ఉండగా, అక్కడికి సమీపంలోని ఉల్లాల కుడ్లలోని కోఆపరేటివ్ బ్యాంకులో దొంగలు బీభత్సం సృష్టించారు
కర్ణాటకలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళూరు పర్యటనలో ఉండగా, అక్కడికి సమీపంలోని ఉల్లాల కుడ్లలోని కోఆపరేటివ్ బ్యాంకులో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసులు ముఖ్యమంత్రి బందోబస్తు విధుల్లో బిజీగా ఉండటంతో అదును చూసి బ్యాంకులోకి చొరబడిన దొంగలు రూ.15 కోట్ల విలువైన బంగారం, రూ.5 లక్షల విలువైన నగదు దోచుకువెళ్లారు. ఈ సంఘటనతో ఉలిక్కిపడిన కర్ణాటక పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.
కర్ణాటకలో సంచలన చోరీ కేసులు ఆ రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్నటికి నిన్న బీదర్ పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎం సెంటరును కొల్లగొట్టిన దుండగులు రూ.93 లక్షలు దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ సమయంలో అడ్డుచ్చొని సిబ్బందిపై కాల్పులు జరిపిన దుండగులు హైదరాబాదు పారిపోయారు. అక్కడి నుంచి రాయపూర్ వెళ్లే క్రమంలో అప్జల్ గంజ్లోని ప్రైవేటు ట్రావెల్స్ కార్యాలయ సిబ్బంది బ్యాగులు తనిఖీ చేయగా, వారిపైనా కాల్పులు జరిపారు. ఈ కేసులో నిందితుల కోసం ఇటు హైదరాబాద్, అటు కర్ణాకట పోలీసులు గాలిస్తుండగా, మంగళూరులో జులాయి సినిమా తరహా దొంగతనం జరగడం సంచలనం సృష్టిస్తోంది.
అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలో పోలీసులు ఓ రాజకీయ నాయకుడు బందోబస్తు విధుల్లో ఉండగా, దొంగలు ఓ బ్యాంకును కొల్లగొడతారు. ఈ సినిమా నుంచి స్ఫూర్తి పొందారేమో శుక్రవారం మంగళూరు జిల్లాలోని అదే తరహాలో దోపిడీకి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళూరులో పర్యటిస్తుండగా, ఆయన భద్రత నిమిత్తం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీంతో ఉల్లాల కుడ్ల అనే గ్రామంలోని ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకులో పెద్దగా అలికిడి లేనట్లు గమనించి దుండగులు పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు.
ఈ బ్రాంచిలో కొద్ది మంది వినియోగదారులు, ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు గుర్తించిన దుండగులు మరణాయుధాలతో బ్యాంకులో ప్రవేశించిన ఐదుగురు దొంగలు బెదిరించి రూ. 15 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోచుకున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే అతిపెద్ద దొంగతనాలు జరగడంతో కర్ణాటక పోలీసులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు.