వైసీపీ పాటలుపాడి తప్పు చేశా: మంగ్లీ ఓపెన్ లెటర్!
ఒక వేళ వైసీపీ తరఫున పాటలు పాడినా.. ఇతర రాజకీయ పార్టీలపై ఎన్నడూ విమర్శలు చేయలేదన్నారు.
తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకురాలు.. మంగ్లీ సంచలన బహిరంగ లేఖ రాశారు. తాను వైసీపీ తరఫున రాజకీయ పాటలు పాడి..అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి పాడి తప్పుచేశానా? అని అనిపించిందన్నారు. అయినా.. తాను 2019లో వైసీపీ తరఫున రాజకీయ పాటలు పాడానని.. 2024 ఎన్నికల సమయంలో మాత్రం పాడలేదని చెప్పారు. ఈ మేరకు మంగ్లీ బహిరంగ లేఖ రాశారు. తాను ఏ రాజకీయ పార్టీపైనా ఆశలు పెట్టుకోలేదని.. ఏ పార్టీ తరఫు వకాల్తా పుచ్చుకోలేదని చెప్పారు. ఒక వేళ వైసీపీ తరఫున పాటలు పాడినా.. ఇతర రాజకీయ పార్టీలపై ఎన్నడూ విమర్శలు చేయలేదన్నారు.
ఇక, నుంచి రాజకీయ పార్టీలకు పాటలు పాడకూడదని నిర్ణయించుకున్నట్టు మంగ్లీ తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహ న్ నాయుడితో కలిసి మంగ్లీ అరసవల్లిలోని సూర్యదేవుని ఆలయాన్ని సందర్శించుకున్నారు. అయితే.. కేంద్ర మంత్రితో కలిసి మంగ్లీ ఇలా దర్శనం చేసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి తీవ్ర వ్యాఖ్యలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన మంగ్లీ తాజాగా ఓపెన్ లెటర్ రాశారు. ఒక ప్రముఖ నాయకుడితో కలిసి దేవుడి దర్శనానికి వెళ్తే.. దానికి కూడా రాజకీయాలు అంటగడతారా? అని ఆమె ప్రశ్నించారు.
రాజకీయాలకు వ్యక్తిగతంగా తాను దూరంగా ఉన్నానని మంగ్లీ చెప్పారు. అయితే.. గాయకురాలిగా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే వైసీపీకి పాటలు పాడానని, అదేవిధంగా తెలంగాణలోనిమరికొన్ని పార్టీలకు కూడా పాడినట్టు తెలిపారు. ఇది గాయకురాలిగా తన వృత్తికి సంబంధించిన విషయమని పేర్కొన్న మంగ్లీ.. వైసీపీకి పాడిన తర్వాత తనకు అనేక అవకాశాలు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో వైసీపీకి ఎందుకు పాడానా? అని బాధకలిగినట్టు పేర్కొన్నారు. ``కేవలం వైసీపీకి మాత్రమే పాటలు పాడలేదు. అన్ని పార్టీల నాయకులకు కూడా ఎన్నికల సమయంలో పాటలు పాడా. అయితే వైసీపీకి పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయా`` అని ఆమె పేర్కొన్నారు.