దేశ రాజకీయాల్లో ఓ నిస్వార్థ నేత శకం ముగిసింది
కానీ, గొప్ప అధికారిగా, ఎంతో గొప్ప మంత్రిగా.. ఇంకెంతో గొప్ప ప్రధాన మంత్రిగా మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. అన్నిటికి మించి అత్యంత నిస్వార్థ నాయకుడిగా అందరికీ గుర్తుండిపోతారు.
ఆయన నోరు తెరిచి ఏ విషయమూ మాట్టాడి ఉండకపోవచ్చు.. తనదైన ముద్ర ఇదని చెప్పుకొని ఉండకపోవచ్చు.. తాను సాధించినదానిపై ఊరూరా గొప్పలు పోయ ఉండకకపోవచ్చు.. అదే పనిగా విదేశాలకు తిరిగి ఉండకపోవచ్చు.. కానీ, గొప్ప అధికారిగా, ఎంతో గొప్ప మంత్రిగా.. ఇంకెంతో గొప్ప ప్రధాన మంత్రిగా మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. అన్నిటికి మించి అత్యంత నిస్వార్థ నాయకుడిగా అందరికీ గుర్తుండిపోతారు.
పనితీరే మన్మోహనం
ఆర్థికవేత్తగా డాక్టర్ మన్మోహన్ సింగ్ మనందరికీ తెలిసిన వ్యక్తే. రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన ఆయనను పట్టుబట్టి ఆర్థిక మంత్రిని చేశారు తెలుగు వారైన ప్రధాని పీవీ నరసింహారావు. అదే భారత దేశ చరిత్రలో అతిపెద్ద మలుపు. పీవీ అండతో ఆర్థిక మంత్రిగా సంస్కరణలు అమలు చేశారు మన్మోహన్. దీంతో విదేశీ సంస్థలకు తలుపులు తెరిచినట్లయింది. లైసెన్స్ రాజ్ కు తెరపడింది. మన ఇప్పుడు చూస్తున్న సరళ ఆర్థిక విధానాలు పీవీ-మన్మోహన్ చేపట్టిన సంస్కరణల పుణ్యమే. లేదంటే దేశం ఇప్పటికి ప్రపంచంతో పోటీ పడలేకపోయేది. థర్డ్ వరల్డ్ కంరీగానే మిగిలిపోయేది.
ప్రధానిగా సమ్మోహనం..
ఇక ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పదవీ కాలం పదేళ్లపాటు సాగింది. ఇందులో 2004-09 మధ్య దేశానికి స్వర్ణ యుగమే అనుకోవాలి. ఆ సమయంలో వామపక్షాల మద్దతుతో కొనసాగిన యూపీఏ-1 సర్కారులో సాధారణ ప్రజలకు చాలా మేలు జరిగింది. అయితే, 2009 తర్వాత పరిపాలన కాస్త గాడితప్పిన మాట వాస్తవమే. కానీ, మన్మోహన్ మాత్రం విఫలం కాలేదనేది వాస్తవం.
ఆయన పన్మోహన్ కూడా..
మన్మోహన్ ప్రధాని అయ్యేటప్పటికి ఆయన వయసు 71. సహజంగా అందరూ విశ్రాంత జీవితం కోరుకునే దశ అది. అలాంటి వయసులోనూ ఆయన ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేశారు. అందుకే ఆయనను పన్మోహన్ సింగ్ గానూ కొనియాడేవారు. కాగా, ప్రస్తుతం 91 ఏళ్లు పూర్తిచేసుకున్న మన్మోహన్ సింగ్.. గురువారంతో రాజ్య సభ సభ్యుడిగా పదవీ కాలం పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ నుంచి రాజ్య సభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో అసోం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాగా, సహజంగానే తక్కువ మాట్లాడే మన్మోహన్.. పదేళ్లు ప్రధానిగా ఉన్నప్పటికీ అదే పంథాను అనుసరించారు. పార్లమెంటు, బహిరంగ సమావేశాల్లో తప్ప బయట ఎక్కువగా మాట్లాడింది లేదు. అయితే, పదవులకు కక్కుర్తిపడకుండా, అవినీతి మరక లేకుండా జీవితాంతం నిజాయతీగా వ్యవహరించారని మాత్రం చెప్పవచ్చు. 91 ఏళ్లు నిండుతున్న మన్మోహన్ ప్రస్తుతం చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. క్రియాశీల రాజకీయాలకూ దూరంగానే ఉన్నారు. గురువారంతో రాజ్య సభ పదవీ కాలమూ ముగిసింది. అలా.. ఓ నిస్వార్థ అధికారి, నాయకుడి ప్రజా ప్రస్థానం ముగిసందని భావించాలి. ఆయన వందేళ్లు జీవించాలని ఆకాంక్షిద్దాం.