ప్రధాని పదవి హుందాతనాన్ని దిగజార్చారు: మోడీపై ఎం.ఎం. ఫైర్!
ప్రస్తుతం వీల్ చైర్‌కే పరిమితమైన మన్మోహన్ సింగ్.. ఓ బహిరంగ లేఖను సంధించారు.
పార్లమెంటు ఎన్నికల తుది దశ ప్రచారం ముగిసిన తర్వాత.. దేశ రాజకీయాల్లో ట్విస్టు చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్(ఎం.ఎం) తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ప్రధాని పదవి హుందా తనాన్ని దిగజార్చారని మండిపడ్డారు. ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడీ నోటీ నుంచి ద్వేష పూరిత పదాలు.. అత్యంత దారుణమైన పదాలు వస్తున్నాయని.. వినేందుకుసైతం ఏహ్యం కలిగిస్తున్నాయని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం వీల్ చైర్‌కే పరిమితమైన మన్మోహన్ సింగ్.. ఓ బహిరంగ లేఖను సంధించారు. దీనిలో తొలిసారి ఆయన మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ చేస్తున్న ప్రసంగాలు గతంలో ఏ ప్రధాని చేయలేదని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. తద్వారా.. మోడీ ప్రధానికార్యాలయం పరువును హుందాతనాన్ని తగ్గిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని.. నిరంకుశ పాలన నుంచి రక్షించేందుకు ప్రజలు దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రధాని ఈ దేశానికి చేసింది ఏమీలేదన్నారు. రైతుల ఆదా యాన్ని పెంచుతామని చెప్పిన మోడీ.. ఆదాయాన్ని పెంచకపోగా.. పంజాబ్ రైతన్నలపై తుపాకీ గుళ్లు పేల్పించారని.. పైగా రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు. మోడీ చేస్తున్న ప్రసంగాలు అత్యంత దుర్మార్గంగా, ద్వేషపూరితంగా ఉంటున్నాయని మన్మోహన్ సింగ్ తెలిపారు.
మోడీ హయాంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని తన ఇష్టానికి అనుగుణంగా మార్చుకోవడం దారుణ మని అన్నారు. అంతేకాదు.. కరోనా మరణాలు దాచారన్న అంతర్జాతీయ నివేదికలను కూడా.. దాచిపెట్టా రని.. మీడియాను కూడా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని.. ఇంతగా ఏ ప్రధానీ 75 ఏళ్ల భారత దేశ చరిత్రం అభద్రతా భావనతో లేరని మన్మోహన్ వ్యాఖ్యానించారు. కాగా.. జూన్ 1న తుదిదశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మాజీ ప్రధాని లేఖకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.