డ్రింకర్ సాయి దర్శకుడిపై దాడి.. మంతెనకు అలాంటి అభిమానులా?
ఆదివారం గుంటూరులోని శివ థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న వేళలో.. మంతెన సత్యనారాయణ అభిమానులమంటూ కొందరు వచ్చి.. చిత్ర దర్శకుడిపై దాడికి పాల్పడ్డారు.
మసాలా దట్టించి.. అభ్యంతరకర పదాలు.. బోల్డ్ సీన్స్ తో వచ్చిన డ్రింకర్ సాయి సినిమా ఇప్పుడు వార్తల్లోకి వచ్చేసింది. గత వారం విడుదలైన ఈ సినిమాకు బజ్ అంతంతమాత్రంగా ఉన్న వేళలో.. ఆదివారం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా గుంటూరకు వెళ్లిన చిత్ర దర్శకుడి మీద కొందరు దాడి చేయటంతో ఈ సినిమా మొయిన్ స్ట్రీం వార్తల్లోకి వచ్చేసింది. ఇంతకూ దర్శకుడి మీద దాడి చేసిందెవరు? వారెందుకు చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే మాత్రం కొత్త సందేహాలు వచ్చేయటం ఖాయం.
బోల్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తీసిన డ్రింకర్ సాయి మూవీకి ప్రచారాన్ని చేపట్టేందుకు చిత్ర యూనిట్ చాలానే కష్టపడినప్పటికి.. ఫలితం మాత్రం అంతంతే. ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఇప్పుడు అందరి నోట నానే ఘటన తాజాగా చోటు చేసుకుంది. ధర్మ హీరోగా నటించిన ఈ మూవీకి తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. ఆదివారం గుంటూరులోని శివ థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న వేళలో.. మంతెన సత్యనారాయణ అభిమానులమంటూ కొందరు వచ్చి.. చిత్ర దర్శకుడిపై దాడికి పాల్పడ్డారు.
ఎందుకిలా? అంటే.. ఈ సినిమాలో మంతెన సత్యనారాయణను గుర్తు చేసేలా ఒక స్ఫూఫ్ పాత్ర ఉండటం.. దానని భద్రం పోషించారు. ఇది మంతెనను కించపరిచేలా ఉందన్నది దాడి చేసిన వారు వినిపిస్తున్న వాదన. ప్రక్రతి వైద్యాన్ని.. దాని విధానాలను బోధించే మంతెనకు.. ఆయన విధానాల్ని కామెడీ చేసే వారి మీద దాడి చేసేంత వీరాభిమానులు ఉన్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. దాడి సందర్భంగా.. సినిమాను సినిమాలా చూడాలని చెప్పటం.. దానికి దాడికి పాల్పడే వారి హంగామా.. హడావుడి సోషల్ మీడియాలో చర్చకు తెర తీసింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం దాడి లాంటివి ప్లాన్ చేశారా? అంటూ కొందరు తమ సందేహాల్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.