మంత్రి తలపై పసుపుతో అభిషేకం... మేటర్ సీరియస్!

ఈ క్రమంలో రోటీన్ కి భిన్నంగా ఏకంగా మంత్రి తలపై పసుపు జల్లి నిరసన వ్యక్తం చేశాడు ఒక వ్యక్తి. దీనికి సంబందించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Update: 2023-09-08 15:11 GMT

విసిగి అలిసిపోయిన కొంతమంది సామాన్యులు, ఉద్యమకారులు, నిరసనకారులూ... ఆయా నేతలపై ఇంకు చల్లుతూ నిరసన తెలుపుతుండటం వంటి సంఘటనలు చాలానే జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోటీన్ కి భిన్నంగా ఏకంగా మంత్రి తలపై పసుపు జల్లి నిరసన వ్యక్తం చేశాడు ఒక వ్యక్తి. దీనికి సంబందించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అవును... నాయకులు ఎన్నికల వేళ ఇచ్చే హామీలను నమ్మి ఓట్లేసిన జనం, ఆ తర్వాత ఆ హామీలు నెరవేరించుకోవడం కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. తాజాగా మహారాష్ట్రలో ఒక వ్యక్తికి అలాంటి పరిస్థితే అనుభవంలోకి వచ్చింది. దీంతో తన సమస్య ప్రపంచానికి తెలియాలని అనుకున్నాడో.. లేక, తన ఆగ్రహం మంత్రికి తెలపాలనుకున్నాడో తెలియదు కానీ... జేబులో ఉన్న పసుపు ప్యాకెట్ విప్పి మంత్రి తలపై చల్లాడు.

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలో రిజర్వేషన్‌ లను డిమాండ్ చేస్తున్న ఓ వర్గానికి చెందిన ప్రజలు మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌ ను కలుసుకునేందుకు సోలాపుర్‌ లోని ప్రభుత్వ రెస్ట్‌ హౌస్‌ కు వెళ్లారు. అనంతరం మంత్రికి లేఖ ఇచ్చారు. ఈ క్రమంలో వీరు ఇచ్చిన లేఖను మంత్రి చదువుతున్నారు. అంతలో వారిలో ఒకరు తన జేబులో నుంచి పసుపు ప్యాకెట్ తీసి.. పాటిల్‌ తలపై చల్లాడు.

ఈ హటాత్పరిణామానికి అవాక్కైన మంత్రి అతడినుంచి పక్కకు జరిగారు. ఈ సంఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనుచరులు సదరు వ్యక్తిపై దాడికి దిగారు.. కింద పడేసి గట్టిగానే కొట్టారని తెలుస్తుంది. అయితే మంత్రి అనుచరులతో దెబ్బలు తినుతూ కూడా ఆ వ్యక్తి తన డిమాండ్ ని బలంగా వినిపిస్తూ నినాదాలు చేయడం గమనార్హం.

ఈ సంఘటన అనంతరం బయటకు వచ్చిన ఆ వ్యక్తి తనను శేఖర్ బంగలే గా పరిచయం చేసుకున్నాడు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడాడు. తన వర్గం ఎదుర్కొంటోన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే అలా చేసినట్లు తెలిపాడు. తమ సమస్యను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పరిష్కరించాలని కోరాడు!

అయితే ఆ వ్యక్తిని తన అనుచరులు కుల్లబొడిసినప్పుడు స్పందించాడో లేదో తెలియదు కానీ... అనంతరం మైకులముందుకు వచ్చిన మంత్రి ఈ ఘటనపై స్పందించారు. పసుపు సంతోషానికి గుర్తు అని, ఈ ఘటనలో తనకు ఎలాంటి తప్పూ కనిపించలేదని చెప్పుకొచ్చారు! ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News