2024 విషాదం.. ప్రముఖులు కాలగర్భంలోకి..

అయితే.. 2025 ఎలా ఉండబోతున్నా.. 2024 మాత్రం పలు విషాదాలను మిగిల్చింది. పలువురు ప్రముఖులు ఇదే ఏడాదిలో తనువు చాలించారు.

Update: 2024-12-28 12:30 GMT

మరో మూడు రోజుల్లో 2024 సంవత్సరం ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి గ్రాండుగా వెల్ కం చెప్పేందుకు ప్రపంచం సిద్ధం అవుతోంది. అందులోనూ మన దేశ ప్రజలు కూడా కొత్త సంవత్సరం సందర్భం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. 2025 ఎలా ఉండబోతున్నా.. 2024 మాత్రం పలు విషాదాలను మిగిల్చింది. పలువురు ప్రముఖులు ఇదే ఏడాదిలో తనువు చాలించారు.

ముఖ్యంగా టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా. ఈయన ఈ ఏడాది అక్టోబర్ 9న చనిపోయారు. టాటా గ్రూప్ ప్రపంచస్థాయికి ఆయన నాయకత్వంలోనే ఎదిగింది. అలానే.. దిగ్గజ వ్యాపారవేత్తల్లో రతన్ టాటా ఒకరిగా నిలిచారు. మార్గదర్శకుడిగా, మానవతావాదిగానూ ఆయనకు పేరుంది. దేశానికి ఎలాంటి ఆపద వచ్చినా సాయం చేయడంలో ఆయన ముందుండేవారు. కరోనా సమయంలనూ దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. రూ.500 కోట్లు సాయం అందించారు. అలాగే.. దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి విపత్తు ఎదురైనా సాయం అందించేందుకు తాను ఉన్నా అని ముందుకొచ్చేవారు. లాభాపేక్ష కోసమే అని కాకుండా దేశ ప్రయోజనాల కోసమే ఆయన తన వ్యాపారాన్ని కొనసాగించారని చెప్పాలి. అందుకే టాటా గ్రూపు సంపదలో ఎక్కువ శాతం ట్రస్ట్‌ల ద్వారా ధార్మిక కార్యక్రమాలకు అందించేవారు.

ప్రముఖ తబాలా విధ్వంసుడు, గ్రామీ అవార్డు గ్రహీత జాకీర్ హుస్సేన్ డిసెంబర్ 15న చనిపోయారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆయన మృతిచెందారు. జాకీర్ హుస్సేన్ తన సంగీతంతో లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టారు. 1951, మార్చి 9న ఆయన ముంబైలో జన్మించారు. 2023లో పద్మవిభూషన్, మూడు గ్రామీ అవార్డులతో పాటు అనేక ప్రశంసలను సొంతం చేసుకున్నారు. జాకీర్ హుస్సేన్ సంగీత ప్రయాణం చిన్న వయసులోనే ప్రారంభం అయింది. కేవలం 11 ఏళ్ల వయసులోనే ఆయన తన మొదటి సంగీత కచేరీని అమెరికాలో ప్రదర్శించారు. ఆయన తొలి ఆల్బర్ ‘లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్’ 1973లో రిలీజ్ అయింది. పేరుగాంచిన తవా, థాలీ వంటి వంటగది పాత్రలతో కూడా ఆయన సంగీతాన్ని సృష్టించే అంత ఘటికుడు. జాకీర్ హుస్సేన్ జార్జ్ హారిసన్ 1973 ఆల్బర్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్, జాన్ హ్యాండీ 1973 ఆల్బమ్ హార్డ్ వర్క్‌లో భాగస్వామిగానూ ఉన్నారు. ఆయన వాన్ మోరిసన్ 1979 ఆల్బమ్ ఇన్ టు ది మ్యూజిక్ అండ్ ఎర్త్, విండ్ అండ్ ఫైర్ 1983 ఆల్బమ్ పవర్‌లైటులోనూ ప్రదర్శనిచ్చారు.

ఇక సీనియర్ రాజకీయ నాయకుడు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి సెప్టెంబర్ 12న కన్నుమూశారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి జీవితకాలం ఉన్నారు. కార్మికుల హక్కుల కోసమే పోరాడారు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. కాలమిస్టుగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. సీతారాం ఏచూరి 2005 నుంచి 2017 వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా 1992 నుంచి కొనసాగారు. తొలిసారి 1974లో ఎస్ఎఫ్ఐలో చేరారు. 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీకి నియామకం అయ్యారు.

మీడియా రంగంలో తనదైన ముద్రవేసిన మరో ముఖ్యమైన వ్యక్తి రామోజీరావు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఇదే ఏడాది జూన్ 8న తనువు చాలించారు. మీడియా రంగంలో ఆయన ఎనలేని సేవలందించారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈనాడు పత్రిక, ఈటీవీ చానళ్ల ద్వారా ప్రజలకు ఎంతగానో చేరువయ్యారు. అలాగే.. ప్రజలకు, రైతుకు ఉపయోగపడే చాలా కార్యక్రమాలను తన మీడియా ద్వారా అందించారు. మరీ ముఖ్యంగా విపత్తుల సమయంలో ఆయన తన సేవా కార్యక్రమాలతో బాధితులకు ఎంతగానో అండగా నిలిచారు.

వీరితోపాటు ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ ఈ ఏడాది జనవరి 9న కనుమూశారు. ఆయన తన మధురమైన స్వరంతో అందరినీ ఎంతగానో అలరించారు.

ఇక.. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు రోజుల క్రితం డిసెంబర్ 26న మరణించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్ 26, 1932లో మన్మోహన్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని గాహ్‌లో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మన్మోహన్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు. కేంబ్రిడ్జ్ నుంచి పీజీ పట్టా తీసుకున్నారు. అలాగే.. ప్లానింగ్ కమిషన్ చీఫ్‌గా, ఎకనామిక్ అడ్వయిజర్‌గా ప్రభుత్వంలో కీలక హోదాల్లో పనిచేశారు. 1991లో తొలిసారి మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఐదు పర్యాయాలు అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక 1991-96 వరకు అప్పటి ప్రధాన పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగారు. తొలి సిక్కు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డుల్లోకెక్కారు. అంతేకాదు.. భారత ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగానూ ఘనత సాధించారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో భారత ప్రధానిగా మన్మోహన్ సేవలందించారు. ఆయన హయాంలోనే ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చాయి. ఇక 2024లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవి విరమణ చేశారు. పద్మవిభూషణ్ సహా అనేక అవార్డులు, పురస్కారాలను మన్మోహన్ అందుకున్నారు. అలాగే.. భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ 1987లో అందుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం 1995లో పొందారు. ఆసియా మనీ అవార్డు ఫర్ పైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993-1994లో, యూరో మనీ అవార్డు ఫర్ పైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993లో, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఆడమ్ స్మిత్ ప్రైజ్ 1956లో, సెంట్రల్ లండన్‌లోని సెయింట్ జాన్ కాలేజీ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి గాంచిన రైట్ ప్రైజ్ 1955లో పొందారు. వీటితోపాటే.. పలు దేశాల అత్యున్నత పురస్కారాలు సైతం మన్మోహన్ సింగ్ అందుకున్నారు.

Tags:    

Similar News