మావోయిస్టులకు భయం అంటే ఏంటో తెలిసిందా? శాంతి లేఖలు ఉద్దేశం వెనుక వేరే వ్యూహం!
ఆరు దశాబ్దాల సుదీర్ఘ సాయుధ పోరాటం తొలిసారి తలవంచుతుందా? ప్రజల కోసం యుద్ధమంటూ అడవిబాట పట్టిన అన్నలు ఎన్నడూ లేనివిధంగా శాంతి చర్చలకు సిద్ధమంటూ లేఖలు రాయడం నిజమా?;

ఆరు దశాబ్దాల సుదీర్ఘ సాయుధ పోరాటం తొలిసారి తలవంచుతుందా? ప్రజల కోసం యుద్ధమంటూ అడవిబాట పట్టిన అన్నలు ఎన్నడూ లేనివిధంగా శాంతి చర్చలకు సిద్ధమంటూ లేఖలు రాయడం నిజమా? కలా? కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ కగార్ తో కంగారు పడుతున్న మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమవుతున్నట్లు ఈ లేఖ ద్వారా సంకేతాలు పంపుతున్నారా? 1967లో మొదలైన నక్సల్బరీ ఉద్యమం 2004లో మావోయిస్టు పోరాటంగా రూపాంతరం చెంది ప్రస్తుతం అవసాన దశకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణచివేయడతో కేవలం సెంట్రల్ ఇండియాకే పరిమితమైన మావోయిస్టులు ఇప్పుడు అక్కడ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితుల్లో చేతులెత్తేస్తూ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని అంటున్నారు.
ఆపరేషన్ కగార్ తో కేంద్రం తీవ్రమైన అణచివేత అమలు చేస్తుండటంతో మావోయిస్టులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమ చరిత్రలో ఎన్నడూ లేనట్లు గత ఏడాదిన్నరలో సుమారు 400 మంది ఉద్యమకారులను కోల్పోయినట్లు మావోయిస్టులు ప్రకటించారు. దీనికి ఆదివాసీలు, సానుభూతి పరులు అదనమంటున్నారు. ఒకవైపు మావోయిస్టుల మరణాలు, మరోవైపు కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవడంతో ఉద్యమం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితికి దిగజారింది. దీంతో లొంగిపోవడమే తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లో మావోయిస్టులు శాంతి చర్చలకు ముందుకొచ్చినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
అపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టుల నుంచి శాంతి చర్చలకు లేఖ రావడం ఆసక్తి రేపుతోంది. ఎప్పుడూ శాంతి కోసం ప్రభుత్వమే ప్రయత్నించేది. కానీ, ఈ సారి ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి రావడంతోనే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యమం నీరసించిందనేందుకు సంకేతంగా చెబుతున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరుతో ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన లేఖలో ప్రభుత్వానికి శాంతి చర్చల ప్రతిపాదన చేశారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఝార్ఖండ్, మహారాష్ట్రల్లో తక్షణమే కేంద్ర బలగాలను ఉపసంహరించుకుంటే తాము కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలకు వస్తామని మావోయిస్టు పార్టీ తనకు తానుగా ప్రతిపాదించడం చర్చనీయాంశమవుతోంది.